
ఆ ఇద్దరూ క్లాస్‌మేట్స్. అయితే బ్యాక్‌లాగ్స్‌తో అతగాడు ఆమెకు ఓ సెమిస్టర్ జూనియర్ అయిపోయాడు. అయినా వాళ్ల మధ్య స్నేహం కొనసాగింది. ఇదే అదనుగా.. అదీ కాలేజీ క్యాంపస్‌లో.. అందులోనూ మెన్స్ టాయ్‌లెట్‌లో ఆమెపై ఆ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళ్తే..
సౌత్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అత్యాచార ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. నిందితుడిని జీవన్ గౌడ(21)గా నిర్ధారించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేశారు. గురువారం అతనితో క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసి కీలక విషయాలు వెల్లడించారు.
బాధితురాలు(20), జీవన్ ఒకేసారి కాలేజీలో చేరారు. ఈ క్రమంలో జీవన్ ఓ సెమిస్టర్ తప్పడంతో వెనకబడిపోయాడు. అక్టోబర్ 10వ తేదీ ఉదయం కాలేజీకి బాధితురాలికి ఓ పార్సిల్ వచ్చింది. దానిని జీవన్ రిసీవ్ చేసుకుని ఆ వంకతో యువతిని కలిసి అందించాడు. దానిని అందుకుని ఆమె అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయింది. అయితే..
మధ్యాహ్నాం లంచ్ సమయంలో ఆమెకు పదే పదే ఫోన్ చేసి మాట్లాడాలంటూ ఏడో ఫ్లోర్‌లో ఉన్న అర్కిటెక్ట్ బ్లాక్ దగ్గరకు రావాలంటూ పిలిచాడు. అక్కడికి వెళ్లిన ఆమెకు ఎవరూ లేనిది చూసి బలవంతంగా ముద్దు పెట్టాడు. ఈ పరిణామంతో భయానికి గురైన యువతి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పరిగెత్తింది. అయితే..
లిఫ్ట్‌లో ఆమెతో పాటే కిందకు వెళ్లి.. ఆమె నోరు మూసేసి ఆరో ఫ్లోర్‌లో ఉన్న మెన్స్ టాయ్‌లెట్‌లోకి లాక్కెల్లాడు. అక్కడ వాష్‌రూంలో తలుపు బిగించి 20 నిమిషాలపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటన తరవాత ఆమె హాస్టల్‌కు పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితులకు విషయం చెప్పింది. ఆ సమయంలో మరోసారి కాల్ చేసిన నిందితుడు పిల్ కావాలా సీనియర్?( ఎమర్జెన్సీ గర్భనిరోధక మాత్ర) అంటూ వెటకారంగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు. అయితే.. ఇదంతా మాములు విషయమని, పెద్దది చేయొద్దంటూ తోటి రూమ్స్‌మేట్స్‌కు ఆమెకు సలహా పడేశారు.
అయితే.. జరిగిన విషయాన్ని రెండు రోజుల తర్వాత పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వాళలు బెంగళూరు వచ్చి.. అక్టోబర్ 15వ తేదీన హనుమంత నగర పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన క్యాంపస్ ఫ్లోర్‌లో సీసీకెమెరాలు లేకపోవడంతో.. ఫోరెన్సిక్, డిజిటల్ ఎవిడెన్స్ ఆధారంగా విచారణ జరిపారు. చివరకు జీవన్ నేరానికి పాల్పడింది నిర్ధారించుకుని.. అరెస్ట్ చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 64 ప్రకారం.. రేప్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ఈ ఘటనతో రుజువైందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించగా.. ప్రభుత్వం ఈ విమర్శలను తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే.. సదరు ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పటిదాకా ఘటనపై ఎలాంటి స్పందన తెలియజేయలేదు.
ఇదీ చదవండి: వెనక నుంచి వచ్చి.. యామిని మెడపై కత్తి పెట్టి!