
ఖాట్మాండు: నేపాల్‌లో కొత్త ‘కుమారి’ (జీవన దేవత)గా రెండున్నరేళ్ల చిన్నారి ఎంపికైంది. ఆర్య తార శాక్య మంగళవారం సంప్రదాయ ‘కుమారి’ సింహాసనాన్ని అధిష్టించింది. ఖాట్మండులోని తలేజు భవాని ఆలయ పూజారి ఉద్ధవ్ కర్మచార్య తెలిపిన వివరాలివి. మంగళవారం శుభ ముహూర్తంలో జరిగిన ప్రత్యేక వేడుకలో ఆర్య తార శాక్య.. అధికారికంగా ఖాట్మాండు నగరం మధ్యలో ఉన్న బసంతాపూర్‌లోని కుమారి గృహంలోకి ప్రవేశించింది.
తొలి రుతుస్రావానికి ముందే ఎంపిక
కుమారిని శాక్య జాతి బాలికల నుండి ఎంపిక చేస్తారు. అయితే, బాలికకు మొదటి రుతుస్రావం (రజస్వల) కాకముందే ఈ ఎంపిక జరుగుతుంది. ఇంతకుముందు కుమారిగా ఉన్న బాలిక, తన 12వ ఏట మొదటి రుతుస్రావమయ్యాక ఆ బాధ్యతల నుండి ఇటీవల తప్పుకుంది. ప్రస్తుతం కుమారిగా ఎంపికైన బాలిక వయసు 2 ఏళ్ల 8 నెలలని పూజారి తెలిపారు. కుమారిగా అర్హత సాధించడానికి.. ఈ చిన్నారి కఠినమైన ఎంపిక ప్రక్రియను ఎదుర్కొంది.
ఎంపిక కఠినతరం
కుమారిగా ఎంపికయ్యే బాలికకు రుతుస్రావం కారాదు. శరీరంపై ఎలాంటి గీతలు లేదా గాయాలు ఉండకూడదు. అన్నింటికన్నా నిర్భయంగా ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా, ఒక చీకటి గదిలో గేదె తల, భయంకరమైన ముసుగులను ఉంచుతారు. ఆ గదిలోంచి చిన్నారి భయపడకుండా బయటకు రావాలి. కొత్త కుమారిని కొద్ది రోజుల క్రితమే ఎంపిక కమిటీ ఎంపిక చేసింది. కుమారిని హిందువులు, బౌద్ధులు పూజిస్తారు. కుమారిని ఎంపిక చేసే శాక్య జాతిని బౌద్ధులుగా పరిగణించినప్పటికీ, కుమారిని మాత్రం హిందూ దేవతగా గౌరవిస్తారు. ఈ ద్వంద్వత్వం నేపాల్‌లో శతాబ్దాలుగా ఉన్న మత సామరస్యాన్ని సూచిస్తుంది.
500–600 ఏళ్ల క్రితం నుంచే..
ఈ జీవన దేవత లేదా కుమారిని పూజించే సంప్రదాయం.. మల్ల రాజుల పాలనలో సుమారు 500 నుండి 600 ఏళ్ల క్రితం మొదలైంది. అయితే, ఖాట్మండు ప్రధాన ప్రాంతాలలో కుమారిని ఒక ప్రత్యేక రథంపై ఊరేగించే సంప్రదాయం, 18వ శతాబ్దం మధ్యలో చివరి మల్ల రాజు జయప్రకాశ్ మల్ల కాలంలో ప్రారంభమైంది. ఈ సమయంలోనే కుమారి కోసం ప్రత్యేక గృహమైన కుమారి ఘర్ కూడా నిర్మితమైంది. ఖాట్మండులోని హనుమాన్‌ధోకలో కుమారిని తలేజు దేవత మానవ రూపంగా భావిస్తారు. ప్రస్తుతం ఈ జీవన దేవత ఖాట్మండులో విదేశీ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా మారింది. ఏటా ఆగస్టులో వచ్చే ఇంద్ర జాతర పండుగ సందర్భంగా, నేపాల్ అధ్యక్షుడు జీవన దేవతను పూజించి, ఆమె ఆశీర్వాదం పొందే సంప్రదాయం కూడా ఉంది.