అమ్మకే ఒడిగా మారిన తమిళసీమ
దేశంలోనే అత్యధిక ఐవీఎఫ్ క్లినిక్స్
సంతానోత్పత్తి రేటు తగ్గటమే కారణం
జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడా
దేశంలో 2026 జనవరి 6 నాటికి మొత్తం 2,650 ఐవీఎఫ్ క్లినిక్స్ ఉన్నాయి. ఇందులో 25 శాతానికిపైగా క్లినిక్స్‌తో.. భారతదేశపు ఐవీఎఫ్ క్లినిక్‌ల రాజధానిగా తమిళనాడు అవతరించిందని ‘నేషనల్ ఎ.ఆర్.టి. (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ), సరోగసీ రిజిస్ట్రీ; ఎస్.ఆర్.ఎస్. (శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్) రిపోర్ట్ – 2023 గణాంకాలు చెబుతున్నాయి. కృత్రిమ విధానంలో సంతాన భాగ్యం ప్రసాదించే చికిత్సా విధానమే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. దీనికి గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో ఇప్పుడు క్రేజ్ పెరిగింది. ఫలితంగా క్లినిక్కులూ పెరుగుతున్నాయి. నేషనల్ ఎ.ఆర్.టి. (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ), సరోగసీ రిజిస్ట్రీ గణాంకాల ప్రకారం దేశంలో అత్యధిక ఐవీఎఫ్ క్లినిక్‌లు తమిళనాడులో ఉన్నాయి. ఎంత ఎక్కువగా అంటే రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌లో 361 ఉంటే.. దాదాపు వాటికి రెట్టింపుగా 669 క్లినిక్‌లు ఉండటంతో సంతాన సాఫల్య చికిత్సలకు తమిళనాడు ప్రధాన కేంద్రంగా మారింది.
సామాజిక కారణాలు
తమిళనాడులో ఐవీఎఫ్ క్లినిక్‌లు అత్యధిక స్థాయిలో ఉండటానికి సామాజిక, ఆరోగ్య అంశాలను రిజిస్ట్రీ ప్రధాన కారణాలుగా చూపింది. తగ్గుతున్న జననాల రేటు, ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకోవటం, కెరీర్‌పై దృష్టి పెట్టటం వంటి వాటి వల్ల ఆ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు జాతీయ సగటు (2.0) కంటే కూడా బాగా తగ్గిపోయి ఐవీఎఫ్ చికిత్సలకు డిమాండ్ పెరిగిందని విశ్లేషించింది. అంతేకాదు, తమిళనాడులో ప్రైవేట్ వైద్య రంగం అధునాతన సదుపాయాలతో ఉంది. కొత్త సాంకేతికతను వెంటవెంటనే అందిపుచ్చుకుంటోంది. అందువల్ల సంతాన సాఫల్య చికిత్సలు ఆ రాష్ట్రంలో సులువుగా అందుబాటులోకి వస్తున్నాయని తెలిపింది.
చట్టబద్ధమైన నమోదు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎ.ఆర్.టి. నియంత్రణ చట్టం, తమిళనాడులోని క్లినిక్‌లు తమ పేర్లను నమోదు చేసుకోవటంలో పారదర్శకంగా ఉండేందుకు దోహదపడుతోందని రిజిస్ట్రీ తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ నిబంధనల అమలు మెరుగ్గా ఉండటం వల్ల కూడా అధికారిక లెక్కల్లో క్లినిక్‌ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. చెన్నై వంటి నగరాలు ఇప్పుడు కేవలం తమిళనాడుకే కాకుండా, దేశవ్యాప్తంగా, ఇతర దేశాల నుంచి వచ్చే వారికి కూడా ‘ఫెర్టిలిటీ హబ్’గా మారాయి. నిపుణులైన డాక్టర్లు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండటం కూడా తమిళనాడుకు ఈ గుర్తింపును తెచ్చిపెట్టిందని పేర్కొంది.
ఆ రాష్ట్రాల్లో ఎక్కువగా..
గణాంకాల ప్రకారం చూస్తే.. దేశంలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ ఐవీఎఫ్ క్లినిక్కులు ఎక్కువగా ఉన్నాయి. మహారాష్ట్ర, కేరళలలో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్నప్పటికీ క్లినిక్‌లు ఎక్కువగా లేవు.




