యాసంగి సీజన్ కోసం యూరియాపై వ్యవసాయ శాఖ నిర్ణయం
కలెక్టర్లతో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, హైదరాబాద్: గత వానాకాలం సీజన్‌లో యూరియా విషయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని యాసంగి(రబీ)లో ఎరువుల పంపిణీ సాఫీగా సాగేలా వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో యాసంగి సాగు మొదలైంది. ఇప్పటికే 3.95 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 5.45 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. చాలా జిల్లాల్లో రైతులు దుక్కులు దున్ని నార్లు పోశారు. తొలి విడతగా వేసే యూరియా కోసం ఎగబడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో వ్యవసాయశాఖ రైతులకు ఎకరానికి మూడు బస్తాల యూరియా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే జిల్లాల్లో యూరియా పంపిణీ ప్రారంభించింది. రబీ సీజన్ (అక్టోబర్ నుంచి మార్చి వరకు) కోసం కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన 20.10 లక్షల మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులలో 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియానే ఉంది.
ఇందులో అక్టోబర్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి 5.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 24 వేల మెట్రిక్ టన్నులు అదనంగా 5.84 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయింది. ఇందులో ఇప్పటివరకు రైతులు 3.71 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కొనుగోలు చేయగా, ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు (47.68 లక్షల సంచులు) అందుబాటులో ఉన్నాయి.
అయినా చాలా జిల్లాల్లో యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తుండడంతో మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, సంచాలకులు డాక్టర్ గోపితో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గతంలో వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ ప్రణాళిక లోపంతో ఎదురైన పరిస్థితులు పునరావృతం కాకుండా ఈసారి రైతులకు మొదటి నుంచి రేషన్ పద్ధతిలో యూరియా సరఫరా చేయాలని నిర్ణయించారు.
ఐదు జిల్లాల్లో యాప్ ద్వారా పంపిణీ
యూరియా పంపిణీలో అక్రమాలను నిలువరించడంతో పాటు రేషన్ పద్ధతిలో ఒక్కో రైతుకు ఎకరాకు మూడు ఎకరాల మేర సక్రమంగా పంపిణీ చేసేందుకు ‘ఫెర్టిలైజర్ యాప్’ను వ్యవసాయ శాఖ తీసుకొచ్చింది. దీని ద్వారా తొలుత ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద రైతులకు యూరియా బస్తాల పంపిణీ చేయాలని నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టు కింద ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, జనగామ, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో 82,059 మంది రైతులు 2,01,789 యూరియా బస్తాలను కొనుగోలు చేశారు.
మిగతా జిల్లాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నప్పటికీ, రైతుల నుంచి డిమాండ్ పెరగడంతో వారి అవసరాలను బట్టి పట్టా పాస్‌పుస్తకం ఆధారంగా రేషన్ పద్ధతిలో సరఫరా చేయాలని నిర్ణయించారు. వరితో పాటు మొక్కజొన్న, ఇతర పంటలకు కూడా పంట విస్తీర్ణానికి అనుగుణంగానే యూరియా సరఫరా చేయనున్నారు.
కాగా మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు అన్ని జిల్లాలలో ఆయా కలెక్టర్ల పర్యవేక్షణలో యూరియా సరఫరా జరిగేలా వ్యవసాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లాలకు వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు(ఏడీఏ), సంయుక్త సంచాలకులు(జేడీఏ), డీడీఏలను నోడల్ అధికారులుగా నియమించారు.


