ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌పై పెద్ద ఎత్తున దాడుల చేశామని, భారత్‌కు చెందిన యుద్ధ విమానాలు కూల్చివేశామని పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సింధూ మంగళవారం ప్రకటించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, ఈ ఏడాది మే నెలలో ఇరు దేశాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాక్ ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ కేంద్రాలపై వైమానిక దాడుల చేసింది. అయితే, భారత దాడులను గట్టిగా తిప్పికొట్టామని జహీర్ అహ్మద్ బాబర్ సింధూ పేర్కొన్నారు.
భారత వైమానిక దళానికి చెందిన ఆధునిక ఫైటర్ జెట్లను, ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామని చెప్పారు. ఇందులో రఫేల్, ఎస్–30ఎంకేఐ, మిరేజ్–2000, మిగ్–29 లాంటి ఫైటర్ జెట్లు ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా భారత వైమానిక స్థావరాలను, కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ధ్వంసం చేశామని వివరించారు. కానీ, ఆయన అందుకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోవడం గమనార్హం. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్‌కు చెందిన 12న యుద్ధ విమానాలను కూల్చివేశామని భారత ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇటీవల వెల్లడించారు.


