నివేదించిన అమెరికా–చైనా ఆర్థిక, భద్రత సమీక్ష కమిషన్
మోదీ సర్కార్ దౌత్య వైఫల్యంపై కాంగ్రెస్ మండిపాటు
న్యూఢిల్లీ: పహల్గామ్‌లో ఉగ్రవాదుల పాశవిక దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరిట భారత్ జరిపిన దాడులకు పాకిస్తాన్ దీటుగా బదులిచ్చిందని, ఆ నాలుగు రోజుల పోరులో పాక్ పైచేయి సాధించిందని అమెరికా సెనేట్‌లో సమర్పించిన ఓ నివేదికపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది మోదీ సర్కార్ దౌత్యవైఫల్యానికి ప్రబల నిదర్శనమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ గురువారం ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సిందూర్ వేళ కొనసాగిన పరస్పర సైనిక చర్యల్లో భారత్‌పై పాక్ విజయం సాధించిందని అమెరికా–చైనా ఆర్థిక, భద్రత సమీక్ష కమిషన్ మంగళవారం అమెరికా ఎగువసభ అయిన సెనేట్‌లో 800 పేజీల నివేదికను సమర్పించింది. ‘‘108, 109 పేజీల్లో ఏప్రిల్‌లో పహల్గాం దాడి వెనుక పాక్ హస్తముంది. ఆపరేషన్ సిందూర్ వేళ చైనా అందించిన అత్యాధునిక ఆయుధాలతో భారత్‌ను పాక్ ఓడించింది. చైనా అత్యాధునిక ఆయుధాలు, నిఘా సాయంతో పాక్ పైచేయి సాధించింది.
పాక్ సైన్యం మాటున చైనా తన అధునాతన ఆయుధ సంపత్తిని నేరుగా భారత్ పరీక్షించుకునే సువర్ణావకాశాన్ని సద్వినియోగంచేసుకుంది. తద్వారా తమ ఆయుధాల పనితీరును ప్రపంచానికి చాటిచెప్పి అంతర్జాతీయ ఆయుధ, రక్షణ రంగ మార్కెట్‌లో తన వాటాను పెంచుకోవాలని చూసింది’’ అని నివేదిక పేర్కొంది. ‘‘ అమెరికా సెనేట్‌లో సమర్పించిన నివేదికను చూశాకైనా ప్రధాని మోదీ మౌనం వీడతారా? భారత విదేశాంగ శాఖ తన అభ్యంతరాలను వ్యక్తంచేస్తుందా?’’ అని జైరాం రమేశ్ సూటి ప్రశ్న వేశారు.


