గురుతేగ్ బహదూర్ బలిదాన దినం కార్యక్రమంలో మోదీ వ్యాఖ్య
కురుక్షేత్ర: భారత్ ఎల్లప్పుడూ శాంతి మంత్రం జపిస్తుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ భద్రత విషయంలో రాజీపడబోదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్‌తో ఇదే విషయాన్ని ప్రపంచదేశాలకు భారత్ మరోసాటి చాటిచెప్పిందని మోదీ అన్నారు. మంగళవారం హరియాణాలోని కురుక్షేత్ర పట్టణంలో సిక్కుల తొమ్మిదవ మత గురువు గురు తేగ్ బహదూర్ 350వ బలిదాన దినం వార్షిక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.
బహదూర్ స్మారక నాణెం, తపాలా బిళ్లలను ఆవిష్కరించాక మోదీ మాట్లాడారు. ‘‘భారత వారసత్వ సంగమాన్ని నేను ఈరోజు ఒకేసారి చూశా. ఉదయం అయోధ్యలో రామాయణకాలంనాటి నగరాన్ని దర్శించా. ఇప్పుడు శ్రీకృష్ణకాలంనాటి కురుక్షేత్రను సందర్శించా. 2019 నవంబర్ 9న పంజాబ్‌లో సరిహద్దుల్లోని డేరాబాబా నానక్‌ను దర్శించా. కోట్ల మంది రామభక్తుల ఆకాంక్షలను నెరవేరాలని వేడుకున్నా.
అదేరోజు రామమందిరానికి అనుకూలగా సుప్రీంకోర్టులో చరిత్రాత్మక తీర్పు వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈరోజు సిక్కు సంగత్‌లో ఆశీస్సులుపొందే అవకాశం దక్కింది. అందరి సంక్షేమం కోరేవారికి తేగ్ బహదూర్ జీవితమే ఒక చక్కటి ఉదాహరణ. కష్టాలకు ఎదురొడ్డి నిలబడడమే అసలైన విద్య. అదే స్ఫూర్తితో మనం ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చుదాం.
ఈ క్రమంలో ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. భయపడుతూ బతకాల్సిన అవసరం లేదు. ఇదే సూత్రాన్ని భారత్ ఆచరిస్తోంది. స్నేహపూర్వకంగా ఉంటూనే సరిహద్దులను కాపాడుకోవడంఎలాగో ప్రపంచానికి భారత్ నేరి్పస్తోంది’’అని అన్నారు.


