కన్నులపండువగా ధర్మ ధ్వజారోహణ కార్యక్రమం
బాలరాముని గర్భగుడి ప్రధాన గోపురంపై జెండాను ప్రతిష్టించిన ప్రధాని మోదీ
ధర్మ ధ్వజంపై శ్రీరాముని వంశ వృక్షాన్ని తెలిపే సూర్యుడు, కోవిదార వృక్షాల చిహ్నాలు
అయోధ్య: ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముని ఆలయ నిర్మాణ క్రతువు సంపూర్ణమైనందుకు చిహ్నంగా గర్భగుడి ప్రధాన గోపుర శిఖరంపై ధర్మధ్వజ జెండాను ప్రతిష్టించారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ స్వయంగా పూర్తిచేశారు. 161 అడుగుల ఎత్తయిన ప్రధాన గోపురం మీద 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో లంబకోణ త్రిభుజాకృతిలో జెండాను ఎగరేశారు. తొలుత మోదీ శ్రీ రామజన్మభూమి ఆలయ కాంప్లెక్స్‌లో నూతనంగా నిర్మించిన సప్త మందిర్ ఆలయాన్ని దర్శించుకున్నారు. వశిష్ట, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మికి ప్రతిమలతోపాటు అహల్య, నిషాద్‌రాజ్ గుహ, మాతా శబరిలను మోదీ దర్శించుకున్నారు. తర్వాత శేషావతార్ మందిర్‌ను దర్శించుకుని ప్రత్యేక పూజ చేశారు.
ఆ తర్వాత గర్భాలయంలో బాలరాముడిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయ పైభాగానికి చేరుకున్నారు. జెండా ఆరోహణకు ముందు కింద ఉన్న జెండాకు ప్రధాని మోదీ నమస్కరించి పుష్పాలను వెదజల్లారు. తర్వాత బటన్‌ను నొక్కడానికి బదులు ప్రత్యేకంగా తయారుచేసిన ముఖిలిత హస్తాల ఆకృతిలో ఉన్న ఒక మీటను సవ్యదిశలో తిప్పారు. మోదీతోపాటు రాష్ట్రయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఆర్‌ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ సైతం మోదీతోపాటే మీటను తిప్పారు. దీంతో ధ్వజారోహణ పూర్తయింది. తాడు సాయంతో కాషాయరంగు జెండాను పైకి లాగి శిఖరాగ్రాన నిలిపారు.
అత్యంత ఎత్తులో వీచే పెనుగాలులను సైతం తట్టుకుంటూ ఏమాత్రం చిరగకుండా ఉండేలా ప్యారాచూట్ నాణ్యత ఉండే వస్త్రంతో ఈ జెండాను తయారుచేశారు. కాషాయరంగు జెండాపై శ్రీరాముని వంశవృక్షాన్ని తెలిపే సూర్యభగవానుడి చిహ్నం, మధ్యలో ఓంకారం, పక్కన కోవిదార చెట్టు ప్రతిమలను బంగారు దారంతో చేతితో కుట్టారు. ఇందుకు మూడు వారాల సమయం పట్టింది. కోదండరాముడు సూర్యవంశానికి చెందిన రాజు. రుషి కశ్యపుడు మందార, పారిజాత వృక్షాలను అంటుకట్టి కోవిదార వృక్షాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.
మొక్కలకు అంటుకట్టి కొత్త రకం మొక్కలను సృష్టించే శాస్త్రసాంకేతికత వేల సంవత్సరాల క్రితమే ఉందనేందుకు కోవిదార చెట్టే సజీవ సాక్ష్యమని పలువురు చెబుతున్నారు. లింఫ్ గ్రంథులు, థైరాయిడ్ సహా పలురకాల వ్యాధుల చికిత్సలో ఆయుర్వేదంలో ఇప్పటికీ కోవిదార చెట్టు బెరడు, ఆకులు, పువ్వులు, మొగ్గలు, వేర్లను ఉపయోగిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మొక్కను దేవకాంచనం అని కూడా పిలుస్తారు.
నాలుగు రోజులుగా యజ్ఞం
అభిజిత్ ముహూర్తం కలిసిరావడంతో అత్యంత శుభప్రదమైన దినంగా భావించి మంగళవారం ధ్వజారోహణకార్యక్రమం పూర్తిచేశారు. ఇప్పటికే గత మూడ్రోజులుగా ఆలయ ప్రాంగణంలో యజ్ఞం నిరాటంకంగా కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అస్సాం, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌ల నుంచి వచ్చిన పండితులు ఈ యజ్ఞంచేశారు. భారత పురాణాల ప్రకారం వివాహపంచమికి సంబంధించిన అభిజిత్ ముహూర్తంలోని శ్రీరాముడు, సీతల వివాహం జరిగింది. అందుకే ఇదే రోజున ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు.


