దేశీయంగా డేటా సెంటర్ విభాగంలో 30 శాతం వాటా
ఎన్‌టీటీ డేటా సీనియర్ వీపీ జాన్ వెల్లడి
టోక్యో: గ్లోబల్ ఐటీ సేవల దిగ్గజం ఎన్‌టీటీ తమ కృత్రిమ మేథ (ఏఐ) వ్యూహాలకు సంబంధించి భారత్ అత్యంత కీలక మార్కెట్‌గా నిలుస్తోందని వెల్లడించింది. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇండియేఏఐ మిషన్ మొదలైనవి ఇందుకు దన్నుగా ఉంటున్నాయని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ వపర్‌మ్యాన్ తెలిపారు. దేశీయంగా డేటా సెంటర్ విభాగంలో తమకు 30 శాతం మార్కెట్ వాటా ఉందని, సమీప భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకోనున్నామని ఆయన పేర్కొన్నారు. ‘ఏఐ నిపుణులకు భారత్ మాకు హబ్‌గా నిలుస్తోంది. అలాగే ఇక్కడి డెలివరీ సెంటర్‌కి మా ఆసియా పసిఫిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనుబంధంగా పని చేస్తోంది. భారత్‌లో ప్రతిభావంతులైన యువత లభ్యత ఎక్కువగా ఉంటుంది. వారికి శిక్షణనివ్వడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం‘ అని జాన్ తెలిపారు.
దేశీయంగా బీసీజీ, యాక్సెంచర్, డెలాయిట్‌లాంటి సంస్థలు తమకు ప్రధాన పోటీదార్లుగా ఉంటున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డేటా సెంటర్లతో పాటు బెంగళూరు, ఢిల్లీ, ముంబైలాంటి ప్రధాన నగరాల్లోనూ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు జాన్ చెప్పారు. కేవలం డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలనే కాకుండా ఏఐ, కన్సల్టింగ్ సామర్థ్యాలను కూడా పటిష్టం చేసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ఫైనాన్షియల్, బ్యాంకింగ్, బీమా రంగాలతో పాటు కన్సలి్టంగ్ మొదలైన విభాగాలపైనా ఇన్వెస్ట్ చేశామని జాన్ వివరించారు. నవంబర్ 19 నుంచి 26 మధ్యన టోక్యోలో నిర్వహించిన ఎన్‌టీటీ ఆర్‌అండ్‌డీ ఫోరమ్‌లో ఎన్‌టీటీ గ్రూప్ కంపెనీలు 100కు పైగా వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ సెక్యూరిటీ, మొబిలిటీ తదితర విభాగాలకు చెందిన సొల్యూషన్స్ వీటిలో ఉన్నాయి.


