సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో నాలుగు రోజులుగా సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ల ఆచూకీ లేకుండా పోవడంతో, సోషల్ మీడియాలోనూ ప్రజల్లో వీరి ఆచూకిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి స్ఫష్టీకరించారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తమ విదేశీ పర్యటలపై తండ్రీకొడుకుల ఎందుకు గోప్యత పాటిస్తున్నారని నిలదీసిన ఆయన... సీఎస్, డీజీపీలే ప్రజలకు సమాచారం చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.2.93 లక్షల కోట్ల అప్పు చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రజలకిచ్చిన ఒక్క హామీని నెరవేర్చకుండా.. తెచ్చిన అప్పంతా దోచుకుంటోందని మండిపడ్డారు. చివరకు టీడీపీ కార్యకర్తల నూతన సంవత్సర అభినందనలకు కూడా అందకుండా తిరుగుతున్న చంద్రబాబు, లోకేష్ ల కోసం టీడీపీ కార్యకర్తలు వెదుకుతున్నారని... బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి రహస్య పర్యటనలేంటని వెంకటరెడ్డి ఆక్షేపించారు.
ప్రతి 3 నెలలకు చంద్రబాబు, 2 నెలలకు లోకేష్ ప్రత్యేక విమానాల్లో దోచుకున్నది దాచుకోవడానికే రహస్య పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
ఆచూకీ లేని సీఎం చంద్రబాబు
నాలుగు రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆచూకీ తెలియడం లేదు. ఆయన ఏమైపోయాడోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు కనబడుట లేదు. ఆచూకీ ఎక్కడ అనే పోస్టులు వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి ఆచూకీ గురించి రాష్ట్ర డీజీపీ, సీఎస్‌ల వద్ద సమాచారం ఉంటే వెంటనే ప్రజలకు చెప్పాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వానికైనా ఆచూకీ కనుగోనమని కోరాలి. సీఎం చంద్రబాబుతో పాటు సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ సైతం గడిచిన వారం రోజులుగా కనిపించకుండా పోయాడు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నారు. చంద్రబాబు ఆచూకీ గురించి ఎల్లో మీడియా సైతం పలు దేశాల పేర్లు ప్రస్తావిస్తున్నారు. ఎవరూ క్లారిటీగా ఫలానా దేశం వెళ్లాడని కూడా చెప్పడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు, ఇలా రహస్యంగా ఎందుకు తిరుగుతున్నారో అర్థం కావడం లేదు.
శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానాల్లో జంప్
రాష్ట్రమంతా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహించుకుంటుంటే సీఎం చంద్రబాబు మాత్రం అదే రోజు (30.12.2025)న శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉదయం 10.28 గంటలకు వీజేటీ 101 అనే స్పెషల్ ఫ్లైట్‌లో బాలి వెళ్లాడని తెలుస్తోంది. కానీ ఎల్లో మీడియా మాత్రం లండన్ వెళ్లాడని ప్రచారం చేస్తోంది. మంత్రి నారా లోకేష్ కూడా కేబినెట్ మీటింగ్ కూడా వదిలేసి 28-12-2025న శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి కేథ్ వే పసిఫిక్ ఎయిర్‌లైన్స్‌లో హాంకాంగ్ వెళ్లాడని తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులుగా కీలకస్థానాల్లో ఉండి ఇలా రహస్య పర్యటనలు చేయడంలో ఆంతర్యం ఏమిటి? కనీసం ప్రభుత్వం వద్ద కూడా సమాచారం లేకుండా కేబినెట్ మీటింగ్‌లు కూడా వదిలేసి ప్రత్యేక విమానాల్లో ఎందుకు వెళ్లారు? వారి పర్యటన వివరాలు ఎందుకంత గోప్యంగా ఉంచుతున్నారు? కనీసం వారు తిరిగి ఎప్పుడోస్తారో కూడా చెప్పకపోవడానికి ఏవైనా కారణాలున్నాయా? ఇవన్నీ ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు.
ప్రతి మూడు నెలలకు చంద్రబాబు, రెండు నెలలకు లోకేష్
చంద్రబాబు సీఎం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి మూడు నెలలకోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నాడు. ఇప్పటికే ఆరుసార్లు విదేశీ పర్యటనలు చేస్తే, అందులో రెండుసార్లు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి చేసిన రహస్య పర్యటనలే ఉన్నాయి. ఇప్పటికే దుబాయ్, అబుదాబి, లండన్, దావోస్, యూరప్, సింగపూర్ పర్యటనలకు వెళ్లాడు. ప్రస్తుతం బాలి వెళ్లినట్టు తెలుస్తోంది. సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ ఇప్పటికే 9 సార్లు విదేశీ పర్యటనలు చేశాడు. ప్రతి రెండు నెలలకోసారి ప్రత్యేక విమానాల్లో ఆయన విదేశాల్లో విహరించి వస్తున్నాడు. యూరప్, అమెరికా, దావోస్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్, డల్లాస్, కెనడా వెళ్లి వచ్చాడు. ఇప్పుడు ఏ దేశ పర్యటనలో ఉన్నాడో తెలుగుదేశం పార్టీ నాయకులకే క్లారిటీ లేదు.
దోచుకున్నది దాచుకోవడానికే
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే రూ. 2.93 లక్షల కోట్లు అప్పులు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ సంపదను తన బినామీలకు అప్పనంగా దోచిపెడుతున్నాడు. ఆ డబ్బును విదేశాల్లో దాచుకోవడానికి పెట్టుబడులు పెట్టడానికే తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ విదేశీ పర్యటనలు చేస్తున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. ఏపీ ప్రజల సంపదను దోచుకుని విదేశాల్లో దాచుకోవడానికే తండ్రీకొడుకులు రహస్యంగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు.
అరాచకాలకు కేరాఫ్‌గా అధికార పార్టీ ఎమ్మెల్యేలు
రాష్ట్రంలో 164 మంది కూటమి ఎమ్మెల్యేల బాగోతాలు చూస్తే ఒళ్లు గగ్గురుపొడిచేలా ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు లాంటి దారుణాలన్నీ కూటమి ఎమ్మెల్యేల కేంద్రంగానే జరుగుతున్నాయి. మహిళలను వేధిస్తూ ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు వీడియోల సాక్షిగా దొరికిపోయారు. మరికొందరి బాగోతాలు బాధితుల ఫిర్యాదుతో వెలుగుచూశాయి.
ఇప్పుడు శ్రీకాళహస్తి జనసేన నాయకురాలు కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు పోలీసులు ఆయనతోపాటు అతడి అనుచరుడు సుజిత్ రెడ్డి, జనసేన కార్యకర్త పేట చంద్రశేఖర్‌లకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనసేన, టీడీపీ నాయకుల ఆధిపత్య పోరులో ఒక అమాయకుడు బలైపోయాడు. డ్రైవర్ రాయుడి హత్యలో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్, జనసేన నాయకుడు కొట్టే సాయి హస్తం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కోట వినుత ప్రైవేట్ వీడియోలు తీయించడానికి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పూనుకున్నాడని అభియోగాలున్నాయి. ఆ కుట్రలో పావుగా మారిన డ్రైవర్ రాయుడు హత్యకు గురైనట్టు తెలుస్తోందని వెంకటరెడ్డి తెలిపారు. రాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయినా.. పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని కారుమూరి వెంకటరెడ్డి ఆక్షేపించారు.



