
ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ప్రత్యామ్నాయం ఏమీ ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతోనైనా అర్థమై ఉండాలి. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ సంఘం ఆదరా బాదరాగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా సవరణ మొదలెట్టింది. ఎందరు ఎన్ని అభ్యంతరాలు చెబుతున్నా బేఖాతరు చేసింది. అసలు ఈ సవరణ తీరే వేరు. ఇంటింటికీ వెళ్లి కొత్త ఓటర్లను నమోదు చేసుకోవటం, జాబితాలో అప్పటికే ఉన్నవారిని సరిపోల్చుకోవటం, చిరునామాలో లేనివారిని తొలగించటం సాగిపోయేది.
కానీ ఇప్పుడు ఆఖరుసారి ఓటర్ల జాబితా పూర్తి స్థాయి సవరణ జరిగిన 2003 జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకుని, ఆ తర్వాత జాబితాల్లోకి ఎక్కినవారిని ఈసీ సంశయ ఓటర్లుగా పరిగణిస్తోంది. వారినుంచి రకరకాల ధ్రువపత్రాలు అడుగుతోంది. ఇవన్నీ 1955 నాటి జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్‌ఆర్‌సీ)లో నిర్దేశించిన పత్రాలు. సారాంశంలో ఈ ఓటర్లంతా ముందుగా దేశ పౌరులమని నిరూపించుకోవాలి. తమ పుట్టుకకు సంబంధించిన ధ్రువీకరణ పత్రా లతోపాటు తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి.
ఆధార్, గతంలో ఈసీయే జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డు కూడా పనికిరాదట. పనికొచ్చే పత్రాల్లో పాస్‌పోర్టు ఉంది. కానీ ఆ పాస్‌పోర్టు సాధించటానికి పౌరులు ఆధార్ కార్డే చూపుతారని ఈసీ మరిచింది. ఒకపక్కఆందోళనలు సాగుతుండగానే సాగిన ఈ ‘సర్’ ప్రక్రియ తర్వాత ప్రకటించిన ఓటర్ల జాబితా ముసాయిదాలో ఏకంగా 65 లక్షలమంది పేర్లు గల్లంతయ్యాయి. 22 లక్షలమంది మరణించారని తేలిందని, రెండు చోట్ల ఓటుహక్కున్నవారు 7 లక్షల మంది కాగా, వలసపోవటం వల్లనో, ఇతర కారణాల వల్లనో 35 లక్షలమంది జాడలేదని అంటున్నది. అలాంటివారి పేర్లు తొలగించామని చెబుతోంది. నోటీసులిచ్చి, వాదనలు విని తొలగించామంటోంది.
నిరుడు జూలై నుంచి డిసెంబర్ వరకూ ఓటర్ల జాబితాలను సరిచూసి, అవసరమైన సవరణలు చేసి ఈ ఏడాది జనవరిలో ఈసీ తుది జాబితా ప్రకటించింది. అందులో 7.90 కోట్లమంది ఓటర్లుండగా, తాజా ముసా యిదాలో 7.24 కోట్లమంది పేర్లున్నాయి. ఈ ఆర్నెల్లలో 22 లక్షల మరణాలు, మరో 35 లక్షల మంది వలసలు లేదా ఆచూకీ లేకపోవటం మాయాజాలం అనిపించటం లేదా? పైగా ఈసారి కేవలం నెల్లాళ్ల వ్యవధిలో... అంటే జూన్ 24న మొదలై జూలై 25 వరకే ఈ ప్రక్రియ సాగింది.
ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని కోట్లమంది అర్హతల్ని తేల్చిపారేయటం ఎలా సాధ్యమైందన్న సంశయాలు చాలామందికొచ్చాయి. ఈ విషయంలో నిందలు పడుతున్నా ఈసీ గంభీర వదనంతో ‘మీ దగ్గర ఆధారాలున్నాయా?’ అని ఎదురు ప్రశ్నించటం మరిన్ని సంశయాలకు దారి తీసింది. ఇది ఈసీకీ, ఆరోపణలు చేస్తున్న నేతలకూ మధ్య పంచాయతీ కాదు. ఆ ఆరోపణలు అవాస్తమని రుజువు చేస్తే ఈసీ విశ్వసనీయతే పెరుగుతుంది. లేనట్టయితే విపక్షాలు చేసే ‘ఓట్ చోరీ’ ఆరోపణను జనం నమ్ముతారు.
సుప్రీంకోర్టు గురువారం చెప్పింది కూడా ఇదే! తొలగించినవారి పేర్ల ఎదురుగా కారణమేమిటో పేర్కొంటూ జాబితా విడుదల చేయాలనీ, పేరు లేదా ఓటర్ క్రమ సంఖ్య టైప్ చేయగానే వివరాలు కనబడేలా ఆ జాబితా ఉండాలనీ ధర్మాసనం ఆదే శించింది. నిజానికి ‘ఓట్ చోరీ’ ఆరోపణ రాకముందు అలాంటి సదుపాయం ఉంది. అటు తర్వాత మాయమైందంటే ఏమనుకోవాలి? ఈ వివరాలతో పార్టీలకు జాబితా అందించామన్న ఈసీ వాదనలో పస లేదు. ఓటుహక్కు కోల్పోయినవారు కారణం తెలుసుకోవటానికి పార్టీల చుట్టూ తిరగాలా? జాబితా వెల్లడైతే ఓటర్ల గోప్యత హక్కుకు విఘాతం కలుగుతుందన్న సాకు అర్థరహితం. చనిపోయినవారి, ఆచూకీ లేనివారి హక్కులకై ఈసీకి ఎందుకంత తాపత్రయం?
‘సర్’ వల్ల ఎలాంటి పర్యవసానాలుంటాయో ఆ సంస్థకు అర్థమైనట్టు లేదు. బిహార్‌లోని 40 లోక్‌సభ స్థానాల్లో ఒక మీడియా సంస్థ తాజా ముసాయిదా ఆధారంగా విశ్లేషించగా దిగ్భ్రాంతి కరమైన అంశాలు వెల్లడయ్యాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 24 చోట్ల నెగ్గినవారి మెజారిటీ కన్నా ఇప్పుడు తొలగించిన ఓటర్ల సంఖ్య అధికం! ఉదాహరణకు బెగుసరాయ్‌లో విజేత మెజారిటీ 81,480. కానీ అక్కడ తొలగించిన ఓటర్లు 1,23,178 మంది. షోహర్ స్థానంలో తొలగించిన వారు 1,09,723 అయితే, ఆ ఎన్నికల్లో విజేత మెజారిటీ 29,143! ఏ ఎన్నికల్లోనైనా అధిక ధరలు, నిరుద్యోగం వంటివి చర్చకొస్తాయి.
ఈసీ నిర్వాకంతో రాగల బిహార్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా తిరకాసే ప్రధాన అంశం కాబోతోంది. ఇది ఎన్డీయే కూటమికి మంచి పరిణామమైతే కాదు.ఓటర్ల జాబితాలో పేరు తొలగించటమంటే పోటీ చేయటానికిగల హక్కును నిరాకరించటం కూడా. ఇది బిహార్‌తో ఆగదు. ఎన్నికలు జరగనున్న కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళ నాడులకు కూడా విస్తరిస్తుంది. ఇంత అస్తవ్యస్తంగా, ఇంత గోప్యంగా ఉండే ప్రక్రియ ద్వారా ఇంతకూ ఈసీ సాధించదల్చుకున్నదేమిటి?