నిజమైన ఓటర్ల పేర్లు మాత్రం తొలగించొద్దు!: మమత
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ ఓటరు జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్)ను ఓట్‌బందీగా అభివర్ణించారు. తన గొంతు కోసినా సరే, వాస్తవ ఓటర్ల పేర్ల తొలగింపును అడ్డుకుని తీరుతానన్నారు. రాష్ట్రంలో ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌కు ఆమె విజ్ఞప్తి చేశారు. ప్రతి నిజమైన ఓటరు తుది జాబితాలో స్థానం పొందే విధంగా ఈ ప్రక్రియను ఎటువంటి లోపాలు లేకుండా అమలు చేస్తే తప్ప, బిహార్‌లో జరిగినంత సులభంగా బెంగాల్‌లో దీని అమలు సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు.
ఒకప్పటి ఎన్నికల కమిషనర్ టీఎన్ శేషన్ ‘ఈసీ ప్రజల కోసమే తప్ప, ప్రభుత్వం కోసం కాదు’అని చెప్పారంటూ ఆమె గుర్తు చేసుకున్నారు. ఇప్పుడున్న వారు మాత్రం ఎస్ సర్ అని విధేయతతో ఉండటం చూసి విచారం కలుగుతోందని వ్యాఖ్యానించారు. బిహార్‌లో ఎస్‌ఐఆర్ చేపట్టి, తప్పించుకోగలిగారు, బెంగాల్‌లో మాత్రం అలా తప్పించుకోనివ్వం, మీ ప్రతి చర్యను ప్రశ్నిస్తాం’అంటూ హెచ్చరించారు. ప్రజలకు బదులుగా మీ యజమానిని సంతృప్తి పరచాలని మాత్రమే చూస్తున్నారంటూ ఈసీపై పరోక్షంగా ఆమె మండిపడ్డారు. సిలిగురి జిల్లా ఉత్తర్‌కన్య పట్టణంలో మీడియాతో మాట్లాడారు. మాతో ఆటలాడు కోవాలని అనుకోవద్దు.
అది అంత సులువు కాదు. ప్రతి నిజమైన ఓటరు పేరును జాబితాలో చేర్చేలా మేం అత్యంత అప్రమత్తంగా ఉంటాం. బీజేపీ ఆదేశాలను అమలు చేయాలని ఈసీ ప్రయత్నించరాదు. ఇలా అంటున్నందుకు నన్ను శిక్షించాలనుకుంటున్నారా? ఏం చేయగలరు మీరు? నా ఓటు హక్కును లాగేసుకుంటారా? జైలుకు పంపుతారా? అరెస్ట్ చేయిస్తారా? నా గొంతు కోసినా సరే, ప్రజలను ఏమీ అనొద్దు, వారి ఓటు హక్కును లాక్కోవద్దు’అని ఆమె కోరారు. నోట్ల రద్దు నోట్‌బందీ అయినట్లే, ఎస్‌ఐఆర్ ఓట్‌బందీగా తయారైందని ఆమె వ్యాఖ్యానించారు. ఎస్‌ఐఆర్‌ను ఈసీ ఇంత హడావుడిగా చేపట్టాల్సిన అవసరం లేనే లేదని మమతా బెనర్జీ పేర్కొన్నారు.


