తమిళనాడు, గుజరాత్ ముసాయిదా
ఓటరు జాబితాపై ఈసీ వెల్లడి
న్యూఢిల్లీ: తమిళనాడు, గుజరాత్‌లలో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనంతరం 1.71 కోట్ల ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితాలో లేవని ఎన్నికల కమిషన్ తెలిపింది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఓటర్లు 11.49 కోట్లు కాగా, వీరిలో 9.78 కోట్ల మంది పేర్లు తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో ఉన్నాయని శుక్రవారం ఈసీ వివరించింది.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన తమిళనాడులో మొత్తం ఓటర్లు 6.41 కోట్ల మంది కాగా, 84.81 శాతం మంది అంటే, 5.43 కోట్ల మంది బూత్ లెవెల్ అధికారులకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారని తెలిపింది. మిగతా సుమారు 97.37 లక్షల పేర్లు తొలగింపునకు గురయ్యాయంది. అదేవిధంగా, గుజరాత్‌లో మొత్తం ఓటర్లు 5.08 కోట్ల మంది కాగా, 85.50 శాతం మంది, 4.34 కోట్ల మంది ఎన్యుమరేషన్ ఫాంలు అందజేసినట్లు ఈసీ వివరించింది.
మిగతా 73.74 లక్షల మంది పేర్లు ఓటరు జాబితా ముసాయిదా నుంచి తొలగింపునకు గురయ్యాయని తెలిపింది. 2026 జనవరి 18వ తేదీ వరకు ఓటర్లు తమ అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం ఉందని పేర్కొంది. ఫిబ్రవరి 10వ తేదీ వరకు వీటిని పరిశీలిస్తారంది. ఎస్‌ఐఆర్ కొనసాగుతున్న పశ్చిమబెంగాల్, రాజస్తాన్, గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలో ఈ నెల 16వ తేదీన ముసాయిదా జాబితా ప్రకటిస్తామంది. ఇక్కడ మొత్తం 12.32 కోట్ల మంది ఓటర్లు ముసాయిదాలో తమ పేర్లు ఉన్నాయోలేదో చూసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఓటర్లు ముసాయిదా ఓటరు జాబితాను http://ceo. gujarat.gov.in అనే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపింది.


