
తన పదవీకాలం చివరి దశలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తడబాటుకు లోనయి ఏదేదో మాట్లాడి దేశాన్ని ఇరకాటంలో పెట్టేవారు. అయినా తమ అధ్యక్ష అభ్యర్థిగా డెమాక్రటిక్ పార్టీ ఆయన్నే ఎంచుకోవటం, చివరికి ఆయన పోటీ నుంచి తప్పు కోవటం వంటి పరిణామాలు ఆ పార్టీ ఓటమికి గల పలు కారణాల్లో ఒకటనిఅంటారు. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారం దక్కి ఏడాది కాకుండానే ఆ కోవలో చేరిపోయారు. ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అవగా హన లేకుండా తనకు తోచినట్టు మాట్లాడుతున్నారు.
రష్యా వద్ద ముడిచమురు కొను గోలు ఆపేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు ఆయన గురువారం ప్రకటించారు. దీన్ని నేరుగా ఖండించటానికి మన దేశం మొహమాట పడినట్టుంది. అందుకే ఆ వెంటనే మీడియా సమావేశంలో మాట్లాడిన మన విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించకుండా అధినేతలిద్దరి మధ్యా ఫోన్ సంభాషణలు జరిగినట్టు సమాచారం లేదని తెలిపి ఊరుకున్నారు. ముడి చమురు విషయంలో మాత్రమే కాదు, వేరే అంశాల్లోనూ ట్రంప్ అయోమయంగా మాట్లాడారు.
ఇరాన్, పాకిస్తాన్‌లు రెండూ ఘర్షణలకు దిగినప్పుడు 200 శాతం సుంకాలు విధిస్తానని ఇద్దరినీ హెచ్చరించానని,దాంతో వారు దారికొచ్చి తన ఆదేశాన్ని శిరసావహించారని ఆయన చెప్పుకున్నారు. ఆయన భారత్ బదులు ఇరాన్ అన్నారని అందరికీ అర్థమైంది. అలాంటి వారందరికీట్రంప్ ఇప్పటికే పలుమార్లు చేసిన ఈ మాదిరి ప్రకటనల్ని భారత్ ఖండించిందని కూడా తెలుసు. కానీ తెలియనిది లేదా మరిచిపోతున్నది ట్రంప్ మాత్రమే.
అమలులో ఉన్న అంతర్జాతీయ నియమాల ప్రకారం ఒక దేశం నుంచి దిగుమతులు ఆపేయాలని, దానితో సంబంధ బాంధవ్యాలు నెరపరాదని ఆదేశించగల అధికారం భద్రతా మండలికి మాత్రమే ఉంటుంది. కానీ దురదృష్టమేమంటే కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆ అధికారాన్ని కబ్జా చేసి తాను గీసిన బరి దాటకూడదని దబాయిస్తోంది. రష్యా మన దేశానికి చిరకాల మిత్ర దేశం. సైనిక, వాణిజ్య, ఆర్థిక రంగాల్లో ఆ దేశంతో మన అనుబంధం దశాబ్దాల నాటిది.
ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక ఆ దేశం నుంచి చమురు కొనుగోలు నిలిపేయాలంటూ బైడెన్ హయాం నుంచే అమెరికా ఒత్తిళ్లు తీసుకురావటం మొదలెట్టింది. తన ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలకు ఎంతో అవసరమైనఇంధన అవసరాలకు అనుగుణంగా మాత్రమే నిర్ణయం తీసుకుంటామని మన దేశం పలుమార్లు చెప్పింది. అందుకు ఆగ్రహించి గత ఆగస్టులో అప్పటికే విధించిన 25 శాతం సుంకాలకు తోడు ట్రంప్ మరో 25 అదనంగా వడ్డించారు.
ఈ ఏడాది తొమ్మిది నెలల్లో మన దేశం రష్యా నుంచి సగటున రోజుకు 17 లక్షల బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఈ నెల మొదటినుంచి అది మరో లక్ష బ్యారెళ్ల మేర పెరిగింది. నిజానికి ఇందులో ప్రైవేటు సంస్థల వాటా అధికం. అమెరికా ఒత్తిళ్లను మన ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు మొన్న జనవరితో పోలిస్తే చమురు దిగుమతుల్ని తగ్గించాయి. జనవరిలో కోటి బ్యారెళ్లకు పైగా దిగుమతి చేసుకున్న ఆ సంస్థ గత నెల 46 లక్షల బ్యారెళ్లకు కుదించింది.
పోనీ రష్యా బదులు వెనిజులా లేదా ఇరాన్ నుంచి అదనపు చమురు కొనుగోలుకు మన దేశం ప్రతిపాదించింది. కానీ దానికి సైతం జవాబు లేదు. కనీసం అమెరికాతో ఉన్న 4,270 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు భర్తీ కోసం వంటగ్యాస్ దిగుమతికి ప్రతిపాదించింది. అందుకు కూడా సానుకూల స్పందన లేదు. ప్రస్తుతం అమెరికా నుంచి మన వార్షిక చమురు కొనుగోళ్ల విలువ 1,300 కోట్ల డాలర్లు.
భారత్–అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం కావటానికి ముందు కొన్ని అంశాలను చక్కదిద్దాలని, ఆ దిశగా కృషి చేస్తున్నామని గత నెలలో విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ ప్రస్తుతం ఆ పని మీదే అమెరికాలో ఉన్నారు. ఆ విషయంలో ఒక అవగాహన ఏర్పడేందుకు అమెరికా తనవంతు ప్రయత్నించాల్సి ఉండగా ట్రంప్ తన అర్థరహిత ప్రకటనలతో సమస్యనుమరింత జటిలం చేస్తున్నారు. ఇది సరికాదు.