
వారం రోజుల వ్యవధిలో హరియాణా పోలీస్ విభాగంలో జరిగిన రెండు ఆత్మహత్యలు ఆ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇందులో ఒకరు ఈ నెల 7న ఆత్మహత్య చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దళిత ఐపీఎస్ అధికారి, అదనపు డీజీపీ వై. పూరన్‌కుమార్ కాగా, ఏఎస్‌ఐ సందీప్ లాఠర్ మంగళవారం ప్రాణం తీసుకున్నారు. ఈ రెండు ఆత్మహత్యలూ పోలీస్ విభాగంలో నిలువెల్లా నెలకొన్న అవ్యవస్థకు అద్దం పడుతున్నాయి.
పూరన్ తనకెదురవుతున్న కులవివక్ష గురించి ఆత్మహత్యకు ముందు తొమ్మిది పేజీల లేఖ రాశారు. అయితే మూడు పేజీల లేఖతో పాటు వీడియో విడుదల చేసి మరణించిన సందీప్, అదనపు డీజీపీ పూరన్‌పై అవినీతి ఆరోపణలు చేస్తూ, ‘నిజాన్ని’ బట్టబయలు చేయటానికి ప్రాణత్యాగం చేస్తున్నాననటం, ఈ కేసులో బదిలీ అయిన ఒక ఎస్పీ మంచివారంటూ చెప్పటం ఆశ్చర్యం కలిగించింది. సందీప్ సమర్థుడిగా పేరు తెచ్చుకున్నవారే. పూరన్‌పై దర్యాప్తుచేస్తున్న బృందంలో సభ్యుడు. పూరన్ అవినీతిపరుడైతే పకడ్బందీ దర్యాప్తుతో ఆ సంగతిని బట్టబయలు చేయాలి తప్ప అందుకోసం ప్రాణత్యాగం ఎందుకు?
సమాజాన్ని పట్టి పీడిస్తున్న కులజాడ్యం విద్యాసంస్థలూ, ప్రభుత్వ విభాగాలూ మొదలుకొని సమస్త వ్యవస్థల్లోనూ వేళ్లూనుకున్నదని తరచూ జరుగుతున్న ఉదంతాలు నిరూపిస్తున్నాయి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, ప్రాంతీయ వివక్ష వంటివి సరేసరి. చిత్రమేమంటే అన్ని వ్యవస్థలూ ఇవేమీ లేనట్టు నటిస్తుంటాయి. అందుకే కావొచ్చు... ఈ జాడ్యాలు నిక్షేపంలా కొనసాగుతున్నాయి.
2016లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యా లయంలో రోహిత్ వేముల, 2019లో ముంబైలోని ఒక వైద్య కళాశాలలో పీజీ చేస్తున్న డాక్టర్ పాయల్ తాడ్వి బలవన్మరణాలైనా, వివిధ ఐఐటీల్లో ఆత్మహత్యలు చేసుకున్న ఇతర దళిత విద్యార్థులైనా తమ బలిదానాల ద్వారా ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వాల దృష్టికీ, సమాజం దృష్టికీ తీసుకొచ్చారు. కానీ పాలకుల నుంచి ప్రతిస్పందనలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి.
హరియాణా కేడర్ ఐపీఎస్ అయిన పూరన్ ఉన్నత విద్యావంతుడు. కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడై, అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చేశారు. వివిధ జిల్లాల్లో ఎస్పీగా,అంబాలా ఐజీగా శాంతిభద్రతల పరిరక్షణలో ఆయన కృషినీ, పోలీస్ విభాగాన్ని ఆధునికీకరించటంలో ఆయన పాత్రనూ అందరూ గుర్తుచేసుకుంటున్నారు. పాలనా పరమైన బాధ్యతల్లోనూ, కీలకమైన కేసుల దర్యాప్తులోనూ సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. గత నెలలో రోహ్‌తక్ నుంచి ఒక పోలీస్ శిక్షణ కేంద్రానికి బదిలీ చేసేవరకూ ఆయనపై అవినీతి ఆరోపణలు లేవు. కానీ అక్కడి నుంచి నిష్క్రమించాక రోహ్‌తక్‌లో ఆయన దగ్గర పనిచేసిన హెడ్ కానిస్టేబుల్‌అవినీతి ఆరోపణలపై అరెస్టు కావటం అనుమానాలకు తావిస్తోంది.
అవినీతికి పాల్పడినవారిని రక్షించాలని ఎవరూ కోరరు. కానీ ప్రశ్నలు లేవనెత్తే పూరన్ వంటి దళిత అధికారిని ఆ మాదిరి కేసుల్లో ఇరికించే అవకాశం లేదా? ఆయన పని చేసినచోటల్లా ఈ మాదిరే ఆరోపణలొస్తే వేరే విషయం. ఐఏఎస్ అధికారిణి అయిన ఆయన భార్య అమ్నీత్ కుమార్‌కు సైతం సర్వీసులో మంచి పేరుంది. కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయానికి ఆమె సీఎం నయబ్‌సింగ్ సైనీ వెంట జపాన్ వెళ్లిన అధికార బృందంలో ఉన్నారు. హరియాణా మాఫియా ముఠాలకు నిలయం. మీడియాలో మార్మోగే లారెన్స్ బిష్ణోయ్ ముఠా మొదలుకొని ఎన్నో గ్యాంగ్‌లున్నాయి. పూరన్ అంటే గిట్టని వారు మరో గ్యాంగ్‌స్టర్ ఇందర్‌జిత్‌ను అడ్డంపెట్టుకుని కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారా?
ఏపీలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన 16 మంది సీనియర్ ఐపీఎస్‌లకు ఏడాదిపైగా కాలం నుంచి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్న వైనం కళ్ల ముందే కనబడుతోంది. వీరిలో అత్యధికులు దళిత వర్గాలవారు. వీరి పేర్లు ‘రెడ్‌బుక్’లో ఉండటం తప్ప వేరే కారణం కనబడదు. దేశవ్యాప్తంగా ఇలా బాహా టంగా కులవివక్ష రాజ్యమేలుతుంటే పూరన్ వంటివారు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదనుకోవటంలో వింతేముంది? ఈ కేసులో పారదర్శకంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపించి హరియాణా ప్రభుత్వం తన తటస్థతను నిరూపించుకోవాలి.