
గత రెండేళ్లుగా అపారమైన ప్రాణనష్టాన్నీ, కనీవినీ ఎరుగని విధ్వంసాన్నీ చవిచూసిన గాజా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇజ్రాయెల్–హమాస్‌ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ద్వారా సమకూరిన విజయాన్ని శాంతిగా మలచుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ ఇజ్రాయెల్ పార్లమెంటు కెన్‌సెట్‌నుద్దేశించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పటం... ఆయన గత కాలపు అధ్యక్షులందరికన్నా గొప్ప స్నేహితుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కీర్తించటం ప్రపంచ ప్రజానీకమంతా వీక్షించింది.
హమాస్ చెరలో మిగిలిన 20మంది ఇజ్రాయెల్ పౌరులూ విడుదల కావటం, అటు ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న దాదాపు 10,000 మంది పాలస్తీనా పౌరుల్లో 1,718 మందిని ఆ దేశం విడుదల చేయటం పూర్తయింది. విముక్తులై సొంతగడ్డపై అడుగుపెట్టిన బందీలకూ, ఖైదీలకూ లభించిన అపూర్వ స్వాగతాలు గమనిస్తే వారి కోసం అయినవారు ఎంత ఆత్రంగా నిరీక్షించారో అర్థమవుతుంది. బందీలది రెండేళ్ల చెర అయితే...
ఖైదీలది అంతకన్నా చాలా ఎక్కువ. వారిలో మూడేళ్ల నుంచి ఇరవయ్యేళ్ల వరకూ జైళ్లలో మగ్గుతున్నవారున్నారు. పలువురికి తిరిగి పాలస్తీనాలో అడుగుపెట్టేందుకు అనుమతి లేదంటూ ఈజిప్టుకు తరలించారు. అసలు చాలామందికి వెళ్లి నివసించేందుకు కొంపా గోడూ లేవు. అవన్నీ క్షిపణి దాడుల్లో కుప్పకూలాయి.
శాంతి అంటే కేవలం యుద్ధం లేకపోవటమో, కాల్పుల విరమణకు అంగీకరించ టమో కాదు. పశ్చిమాసియాకు సంబంధించినంతవరకూ అదెంత మాత్రమూ సరిపోదు. ఎందుకంటే అక్కడ ఎంత త్వరగా కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందో, అంత త్వరగానూ ఉల్లంఘనలు కూడా మొదలైపోతాయి. యుద్ధానికీ, యుద్ధానికీ మధ్య ఏర్పడే తాత్కాలిక ఉపశమనంగా అది మారిపోయింది.
1978లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జిమ్మీ కార్టర్ కాలంలో కుదిరిన క్యాంప్ డేవిడ్ ఒప్పందం మొదలుకొని ఇందుకు ఎన్ని ఉదాహరణలైనా చూపవచ్చు. చిత్రమేమంటే 1993లో కుదిరిన ఓస్లో–1 ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్ ఉనికిని పాలస్తీనా విమోచన సంస్థ (పీఎల్‌ఓ) గుర్తించగా, పాలస్తీనా ప్రజలకు ‘నిజమైన ప్రతినిధి’గా పీఎల్‌ఓను ఇజ్రాయెల్ గుర్తించింది. కానీ అందువల్ల పీఎల్‌ఓకు ఒరిగింది లేకపోగా, అది వలసవాద పోలీసు దళంగా మిగిలింది.
దాన్ని నీరుగార్చేందుకు అనంతర కాలంలో హమాస్‌కు పురుడుపోసింది కూడా ఇజ్రాయెలే. 1995 నాటి ఓస్లో–2 ఒప్పందమూ ఇంతే. ఇలా ఇరుపక్షాల మధ్యా కుదిరిన మధ్య వర్తిత్వాలూ, రాజీలూ అసంఖ్యాకం. కానీ వైమానిక, క్షిపణి దాడులు వాస్తవం... శాంతి మిథ్య. ఇజ్రాయెల్‌కు నిరంతరాయంగా అమెరికా సైనిక సాయం అందుతూనే ఉంటుంది. హమాస్ ఉగ్రదాడి తర్వాత 2023 నుంచి ఇంతవరకూ ఇజ్రాయెల్‌కు లభించిన అమెరికా సైనిక సాయం విలువ 2,200 కోట్ల డాలర్ల పైమాటే.
తాజా ఒప్పందం హమాస్ 72 గంటల్లో తన దగ్గరున్న బందీలందరినీ విడుదల చేయాలని, చనిపోయివుంటే మృతదేహాలు అప్పగించాలని నిర్దేశించింది. కానీ మొత్తం 20 అంశాల్లోనూ ఇజ్రాయెల్‌కు నిర్దిష్ట కాలపరిమితిని సూచించే ప్రతిపాదనలేవీ లేవు. అసలు స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుపై స్పష్టత లేదు. ధ్వంసమైన ఆవాసప్రాంతాల పునర్నిర్మాణం సంగతి, జవాబుదారీతనం ఊసు లేదు.
ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా గాజాను తీర్చిదిద్దుతామని ఇప్పటికే ట్రంప్ చెప్పారు. దాని ప్రసక్తి ఇందులో లేకపోయినా చివరకు ఆ దిశగా పావులు కదిపేలా పరిణామాలు ఉండబోతాయన్నది స్పష్టం. అటు షర్మ్ అల్ షేక్‌లో ఆర్భాటంగా జరిగిన శిఖరాగ్ర శాంతి సదస్సుకు నెతన్యాహూ రాకపై తుర్కియే, ఇరాక్‌లు అభ్యంతరం చెప్పటంతో చివరి నిమిషంలో ఆయన ఆగిపోవటమైనా... ఈ సదస్సుకు ఆఖరి నిమిషంలో ఆహ్వానం అంది వచ్చిన పాలస్తీనా అధ్యక్షుడు మహ్ముద్ అబ్బాస్ ప్రేక్షకుడిగా మిగిలిపోవటమైనా జరగబోయేదేమిటో సూచిస్తోంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చొరవ తీసుకుని ట్రంప్ దగ్గరకు ఆయన్ను తీసుకెళ్లటం, వారిద్దరూ కొన్ని సెకన్లు సంభాషించుకోవటం చిన్నపాటి ఓదార్పు. ఎన్ని లోటుపాట్లున్నా ఇప్పుడు కుదిరిన ప్రశాంతత శాశ్వతం కావాలని ఆశించనివారంటూ వుండరు. అది సాకారం కావాలంటే ప్రపంచ ప్రజాభిప్రాయం ఇంకా పదునెక్కాలి. దురాక్రమణలు కనుమరుగై స్వేచ్ఛాయుత పాలస్తీనా దిశగా అడుగులు పడాలి.