
యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం షట్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అణ్వాయుధాల రూపకల్పన, వాటి నిర్వహణ, వాటిని భద్రపరచడానికి బాధ్యత వహించే కీలక ఏజెన్సీ అయిన నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (NNSA) సిబ్బందికి సామూహిక లేఆఫ్స్ తప్పవని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వహణకు నిధులు లేకపోవడంతో ఏజెన్సీ తన ఉద్యోగుల్లో అధికశాతం మందిని తాత్కాలికంగా తొలగించవలసి వస్తుంది. దీంతో అమెరికా జాతీయ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
80 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్
హౌస్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు మైక్ రోజర్స్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ..‘NNSA వద్ద ఉన్న నిధులు త్వరలో అయిపోనున్నాయనే సమాచారం ఉంది. దీని కారణంగా ఏజెన్సీలోని ఉద్యోగుల్లో 80 శాతం మందిని తొలగించాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. యూఎస్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్‌ఎన్‌ఎస్‌ఏపై షట్ డౌన్ ప్రభావాల గురించి మాట్లాడుతూ..‘త్వరలో ఏజెన్సీలో పని చేస్తున్న సుమారు పదివేల మందికి లేఆఫ్స్ ఇస్తాం. మా జాతీయ భద్రతకు వారు కీలకమైన సిబ్బంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ చర్యలు తప్పడం లేదు’ అని తెలిపారు.
జాతీయ భద్రతపై ఆందోళన?
‘ఏజెన్సీలో చాలామంది ఉద్యోగులు దేశానికి సంబంధించిన ముఖ్యమైన వ్యూహాత్మక ఆస్తిని నిర్వహిస్తున్నారు. అందులో భద్రత, అత్యవసర సిబ్బంది విధుల్లో ఉంటారు. మేము ఇప్పటికే ఉన్న ఆయుధాగారాన్ని చెక్కుచెదరకుండా, సురక్షితంగా ఉంచబోతున్నాం. జాతీయ భద్రతపై ఎలాంటి ఆందోళన వద్దు’ అని రైట్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా?