
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మితిమీరిన టారిఫ్‌లతో చెలరేగిపోతున్నారు. గతంలో పెంచిన 25 సుంకాలకు అదనంగా ఇటీవలే భారత్‌పై మరోసారి భారీగా 25 శాతం సుంకాలు పెంచారు. అందుకు రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకుంటోందనే సాకు చెప్పారు. భవిష్యత్తులో ఈ దిగుమతులను తగ్గించుకుంటే సుంకాల నిలిపివేతపై ఆలోచిస్తామని ఉద్ఘాటించారు. అయితే రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులు, వాటి వ్యాపారంపై మాత్రం నోరు మెదపడంలేదు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే లక్ష్యంతో యూఎస్ అనేక ఆంక్షలను, వాణిజ్య పరిమితులను విధించింది. ఇందులో కొన్ని కీలకమైన రష్యా వస్తువులపై టారిఫ్‌లు పెంచినట్లు కూడా తెలిపింది. అయితే, రష్యా నుంచి ప్రస్తుతం అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువుల జాబితాను పరిశీలిస్తే ఈ టారిఫ్‌ల ఎఫెక్ట్ ఎంతమేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాకు రష్యా నుంచి చేసే వస్తువుల నుంచి లబ్ధి చేకూరుతుందనే భావిస్తే ట్రంప్ శత్రువునైనా ముద్దాడేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. కానీ, భారత్ మాత్రం తనకు చమురు తక్కువ ధరకు ఇచ్చే రష్యా నుంచి కొనుగోలు చేస్తే యూఎస్‌కు కంటగింపుగా ఉంది.
అమెరికా కొన్ని ఆంక్షలు, వాణిజ్య నిషేధాలు ఉన్నప్పటికీ కీలకమైన వస్తువులు ఇంకా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇటీవల కొన్ని సర్వేల ప్రకారం.. అత్యధిక విలువ కలిగిన ఎగుమతుల్లో కొన్ని కింది విధంగా ఉన్నాయి.
ఎరువులు (Fertilizers): అత్యంత ముఖ్యమైన దిగుమతుల్లో ఒకటి. వ్యవసాయ రంగంలో కీలకమైన భాస్వరం (Phosphorus), పొటాషియం (Potassium) ఆధారిత ఎరువులు ఇందులో ప్రధానం.
విలువైన రాళ్లు, లోహాలు, నాణేలు (Precious Stones, Metals, Coins): వజ్రాలు, విలువైన లోహాలు వంటివి ఇందులో ఉన్నాయి.
కర్బనేతర రసాయనాలు (Inorganic Chemicals): వివిధ పరిశ్రమలకు అవసరమైన ముఖ్యమైన రసాయనాలను దిగుమతి చేసుకుంటోంది.
యంత్రాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు (Machinery, Nuclear Reactors, Boilers): న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన విడి భాగాలు ఇందులో ఉన్నాయి.
ప్రాథమిక లోహాలు (Other Base Metals): పల్లాడియం, అల్యూమినియం వంటి లోహాలు.
అమెరికా అవసరాలపై ప్రభావం
ఎరువుల కొరత, ధరల పెరుగుదల
రష్యా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువుల్లో ఎరువులు అత్యంత ముఖ్యమైనవి. వీటిపై టారిఫ్‌లు లేదా ఆంక్షలు పెంచితే, అమెరికాలోని రైతులు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. ఎరువుల ధరలు పెరిగితే, ఆహార ధాన్యాల ఉత్పత్తి వ్యయం పెరిగి, అంతిమంగా అమెరికన్ వినియోగదారులకు ద్రవ్యోల్బణం (Inflation) రూపంలో భారం పడుతుంది. రష్యాను దెబ్బతీయడానికి విధించిన టారిఫ్‌లు, అమెరికా ప్రజల జేబులకే చిల్లు పెట్టే అవకాశం ఉంది. ఇది గ్రహించి యూఎస్ చాకచక్యంగా వ్యవహరిస్తోంది.
కీలక లోహాలు, రసాయనాలు
పల్లాడియం వంటి కొన్ని లోహాలు, రసాయనాలు రష్యా నుంచే ప్రధానంగా యూఎస్‌కు దిగుమతి అవుతున్నాయి. వీటిని ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, ఇతర కీలక పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. సరఫరా గొలుసు (Supply Chain)లో ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయాలు దొరికే వరకు ఈ దిగుమతులను నిలిపివేయడం లేదా టారిఫ్‌లు పెంచడం కష్టమైన పని.
ఎంపిక చేసిన టారిఫ్‌లు..
ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముందు అమెరికాకు రష్యా ప్రధానంగా ఎగుమతి చేసిన వస్తువుల్లో ముడిచమురు, గ్యాస్ వంటి ఎనర్జీ ఉత్పత్తులు ప్రధానంగా ఉండేది. యుద్ధం నేపథ్యంలో మొదట్లోనే వాటిపై సంపూర్ణ నిషేధం విధించారు. కానీ, అమెరికా పరిశ్రమలకు నిత్యావసరంగా ఉన్న ఎరువులు, న్యూక్లియర్ ఇంధనం (యురేనియం) వంటి వాటిపై మాత్రం టారిఫ్‌లు, ఆంక్షల అమలులో కొంతమేరకు సడలింపు ఇచ్చారనే చెప్పాలి. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కంటే అమెరికా ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినని వ్యవస్థల్లో మాత్రమే కఠిన ఆంక్షలు విధించారనే వాదనకు తావిస్తోంది.
ఇతర దేశాలపై సెకండరీ టారిఫ్‌ల బెదిరింపులు
రష్యా నుంచి చమురు లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేస్తున్న దేశాలపై ‘సెకండరీ టారిఫ్‌లు’ విధిస్తామని యూఎస్ బెదిరింపులకు పాల్పడుతోంది. ఇది అంతర్జాతీయంగా విమర్శలకు దారి తీస్తోంది. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలపై ఇటువంటి బెదిరింపులు వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో సంబంధం లేకుండా అమెరికన్ విదేశాంగ విధానాన్ని అడ్డంగా పెట్టుకుని అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే ప్రయత్నంగా కనిపిస్తోంది.
చివరగా..
రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రయత్నంలో భాగంగా టారిఫ్‌లను మరింత కఠినతరం చేస్తే అంతర్జాతీయ సరఫరా గొలుసులకు మరింత ఆటంకం ఏర్పడుతుందని యూఎస్ గుర్తెరుగాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు పెరిగేందుకు దోహదం చేస్తుందని గ్రహించాలి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకోవడానికి టారిఫ్‌లపై కాకుండా, మరింత పటిష్టమైన, ప్రపంచ భాగస్వామ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!