
స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లును తిరస్కరించిన డెమొక్రాట్లు
సెనేట్‌లో రిపబ్లికన్లకు మెజార్టీ లేకపోవడంతో ఆమోదం పొందని బిల్లు
గత ఏడేళ్లలో ఇది రెండో షట్‌డౌన్
అత్యవసరం కాని ప్రభుత్వ సేవలు నిలిపివేత
షట్‌డౌన్‌కు తెరదించడానికి సెనేట్‌లో ఓటింగ్
విపక్ష సభ్యులు ఒప్పుకోకపోవడంతో మళ్లీ విఫలం
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో మరో అలజడి మొదలైంది. కీలకమైన స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లుకు సెనేట్‌లో ఆమోదం లభించలేదు. విపక్ష డెమొక్రటిక్ పార్టీ సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. గడువు ముగిసినా బిల్లు నెగ్గకపోవడంతో ట్రంప్ ప్రభుత్వం దేశంలో షట్‌డౌన్ ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. దీంతో అత్యవసరం కాని ప్రభుత్వ సేవలు, కార్యకలాపాలు నిలిచిపోయాయి.
పెద్ద సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. ‘బుధవారం తెల్లవారుజాము 00:01 గంటల’ను సూచించే టైమర్ చిత్రాన్ని ‘డెమొక్రటిక్ షట్‌డౌన్’ పేరిట వైట్‌హౌస్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అమెరికాలో 1981 తర్వాత ఇది 15వ షట్‌డౌన్ కాగా, గత ఏడేళ్లలో ఇది రెండోసారి. చాలావరకు ఈ షట్‌డౌన్లు కేవలం కొన్ని రోజులపాటే కొనసాగాయి.
ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు 2018 డిసెంబర్‌లో షట్‌డౌన్ ప్రకటించారు. దేశ సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం భారీగా నిధులు ఖర్చు చేయడానికి సెనేట్ అంగీకరించలేదు. ఫలితంగా షట్‌డౌన్ అమల్లోకి వచ్చింది. 35 రోజులపాటు కొనసాగింది. ఆధునిక అమెరికా చరిత్రలో ఇదే అత్యధిక కాలం కొనసాగిన షట్‌డౌన్ కావడం గమనార్హం. 2013లో బరాక్ ఒబామా ప్రభుత్వ హయాంలో 16 రోజులపాటు షట్‌డౌన్ కొనసాగింది.
ఆరోగ్య ప్రయోజనాలపైనే ప్రతిష్టంభన
ప్రభుత్వ పరిపాలనకుగాను స్వల్పకాలానికి (ఈ ఏడాది నవంబర్ 21వ తేదీ దాకా) నిధులు విడుదల చేసేందుకు ఉద్దేశించినదే స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లు. దీన్ని షార్ట్–టర్మ్ గవర్నమెంట్ స్పెండింగ్ బిల్లు అని కూడా అంటారు. త్వరలో గడువు తీరిపోనున్న ఆరోగ్య ప్రయోజనాలను పొడిగించాలని డెమొక్రాట్లు పట్టుబట్టగా, అధికార రిపబ్లికన్లు తిరస్కరించారు.
ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని, బిల్లులో చేర్చడానికి వీల్లేదని తేలి్చచెప్పారు. ఆరోగ్య ప్రయోజనాలను పొడిగిస్తే ప్రభుత్వ ఖజానాపై పెనుభారం పడుతుందని స్పష్టంచేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సూచించారు. దాంతో సెనేట్‌లో బిల్లుకు విపక్ష డెమొక్రాట్లు సుముఖత వ్యక్తంచేయలేదు. అమెరికా కాంగ్రెస్ ఉభయసభల్లో ట్రంప్ పారీ్టకి మెజార్టీ ఉన్నప్పటికీ.. సెనేట్‌లో మెజార్టీ లేకపోవడంతో స్టాప్‌గ్యాప్ ఫండింగ్ బిల్లు నెగ్గలేదు.
షట్‌డౌన్ ముగించడంపై ఓటింగ్ విఫలం
షట్‌డౌన్‌ను తక్షణమే ముగించడానికి బుధవారం సెనేట్‌లో ఓటింగ్ నిర్వహించారు. డెమొక్రాట్లు అంగీకరించకపోవడంతో ఓటింగ్ విఫలమైంది. ఆరోగ్య రంగానికి సబ్సిడీలు ఇవ్వాలని, అందుకు నిధులు కేటాయించాలన్న తమ డిమాండ్ పట్ల వారు వెనక్కి తగ్గలేదు. ఇదిలా ఉండగా, తాజా షట్‌డౌన్ ఎన్నిరోజులు కొనసాగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ఇప్పుడేం జరగొచ్చు?
→ షట్‌డౌన్ విధించిన నేపథ్యంలో అత్యవసర సేవల్లో ఉన్న ఉద్యోగులు మాత్రమే విధుల్లో కొనసాగుతారు. అయితే, షట్ డౌన్ ముగిసేదాకా వారికి వేతనాలు చెల్లించరు.
→ అత్యవసర సేవల్లో లేని సిబ్బందిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తారు. 7.50 లక్షల మందిని తొలగించే అవకాశం ఉంది. వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిహారం రోజుకు 400 మిలియన్ డాలర్ల దాకా ఉండొచ్చని అంచనా.
→ ఎఫ్‌బీఐ, సీఐఏ అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ఎయిర్‌పోర్టు సిబ్బంది, హోంల్యాండ్‌సెక్యూరిటీ అధికారులు యథావిధిగా విధుల్లో కొనసాగుతారు. సైనిక దళాలు ఎప్పటిలాగే పనిచేస్తాయి.
→ సోషల్ సెక్యూరిటీ చెల్లింపులకు ఆటంకాలు ఉండవు. ఆరోగ్య బీమాపై వైద్య సేవలు పొందవచ్చు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తాయి.
→ పోస్టల్ సర్వీసులు కొనసాగుతాయి.
→ తమ సిబ్బందిలో 90 శాతం మందిని తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు అమెరికా విద్యాశాఖ ప్రకటించింది.
→ మ్యూజియంలు, జంతు ప్రదర్శనశాలలు, జాతీయ ఉద్యానవనాలు మూతపడుతున్నాయి.