
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలను కఠినతరం చేయడం లేదా ఉన్న ఉద్యోగులను తిరిగి పంపించే నిర్ణయాలు స్వల్పకాలికంగా అమెరికన్ ఉద్యోగులకు మేలు చేస్తాయనే వాదనలున్నాయి. కానీ, దీర్ఘకాలంలో ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచంలో ఆ దేశ పోటీతత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వలస వచ్చిన నిపుణులు (Immigrant professionals) అమెరికా ఆవిష్కరణకు మూల స్తంభాలుగా ఉన్నారు. పేటెంట్లు (Patents), సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (STEM) రంగాల్లో గ్రాడ్యుయేట్లు, వెంచర్ క్యాపిటల్-ఫండ్ పొందిన సంస్థల్లో కీలక స్థానాల్లో విదేశీ నిపుణుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.
వారంతా విరమించుకుంటే అమెరికన్ కంపెనీల్లో నైపుణ్యాల కొరత (Talent Crunch) ఏర్పడుతుంది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఆవిష్కరణ రేటు తగ్గి, ఉత్పాదకత దెబ్బతింటుంది. కొన్ని అంచనాల ప్రకారం, కఠినమైన వలస విధానాలు దీర్ఘకాలంలో అమెరికా స్థూల జాతీయోత్పత్తి (GDP)ని గణీనయంగా తగ్గించవచ్చు.
శ్రామిక శక్తి పెరుగుదలపై ప్రతికూలత
అమెరికన్ స్థానిక జనాభా వయసు పెరుగుతున్న నేపథ్యంలో గత 20 ఏళ్లుగా శ్రామిక శక్తి వృద్ధికి (Labor Force Growth) వలసదారులు ప్రధాన చోదక శక్తిగా ఉన్నారు. 2000 నుంచి 2022 మధ్య 25-54 ఏళ్ల వయసున్న శ్రామికుల్లో దాదాపు మూడు వంతుల పెరుగుదలకు విదేశీయులే కారణం. కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు శ్రామిక శక్తి వృద్ధిని తగ్గిస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే సామర్థ్యాన్ని తీవ్రంగా పరిమితం చేస్తుంది.
పోటీ దేశాలకు లాభం
అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన లేదా ప్రవేశం దొరకని అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు (Highly Skilled Professionals) వేరే మార్గాలను అన్వేషిస్తారు. ఈ సమయంలో కెనడా, జర్మనీ వంటి దేశాలు వీరికి స్వాగతం పలుకుతున్నాయి. అమెరికా కోల్పోయిన ఈ మేధాసంపత్తి (Talent) ఇతర దేశాలకు బదిలీ అవుతుంది. తద్వారా ఆ దేశాల ఆవిష్కరణ, ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి. అమెరికాను కాదని ఇతర దేశాలకు వెళ్లే వలసదారులు అక్కడ వ్యాపారాలను స్థాపిస్తారు. వినియోగాన్ని పెంచుతారు.
ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి!