ట్రంప్‌ పుణ్యమాని.. అమెరికాకు భారీ నష్టం తప్పదా? | US Government Faces Shutdown As Senate Fails To Approve Crucial Funding Bill, More Details Inside | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ పుణ్యమాని.. అమెరికాకు భారీ నష్టం తప్పదా?

Oct 1 2025 12:26 PM | Updated on Oct 1 2025 1:48 PM

Donald Trump ShutDown Effect Big Lose To USA

వాషింగ్టన్‌: కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది. మంగళవారం అర్ధరాత్రి దాకా కీలకమైన నిధుల బిల్లు విషయంలో సెనేట్‌లో హైడ్రామా నడిచింది. రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీల మధ్య ఎంతకీ పొంతన కుదరలేదు. దీంతో, అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లోకి వెళ్లింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మొదలుకాగానే (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30కి) ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

అయితే, అమెరికాలో షట్‌డౌన్‌ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు మూతపడింది. నాడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్‌డౌన్‌గా నిలిచింది. ఇక, ఈసారి షట్‌డౌన్‌ ఎన్ని రోజులు కొనసాగనుంది అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ షట్‌డౌన్‌ కారణంగా అమెరికా తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత షట్‌డౌన్‌ (2018–19) నష్టం..
35 రోజుల పాటు కొనసాగిన ఈ షట్‌డౌన్‌ అమెరికా చరిత్రలోనే అత్యంత దీర్ఘమైనది. Congressional Budget Office (CBO) అంచనా ప్రకారం.. 11 బిలియన్‌ డాలర్ల మేరకు అమెరికా ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక నష్టం వాటిల్లింది. ఇందులో 3 బిలియన్ డాలర్ల మేరకు జీడీపీ స్థిరంగా కోల్పోయింది. అంటే తిరిగి పొందలేని నష్టం ఇది. దీంతో.. 8,00,000 ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా సెలవులోకి వెళ్లారు.

భారీ నష్టం తప్పదా?..
ప్రస్తుత షట్‌డౌన్‌ (2025) నష్టం అంచనా ప్రకారం.. దాదాపు 1,00,000 మంది ఫెడరల్ ఉద్యోగులు రేపటికి రాజీనామా చేయవచ్చని అంచనా ఉంది. దీంతో, 85% నష్టం వాటిల్లే అవకాశం ఉందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. పాస్‌పోర్ట్, వీసా, పబ్లిక్ మీడియా, ఆరోగ్య బీమా సబ్సిడీలు వంటి సేవలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఫెడరల్ కాంట్రాక్టర్లు, చిన్న వ్యాపారాలు, పరిశోధన సంస్థలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవచ్చు. జీడీపీ, ఉద్యోగ గణాంకాలు, ద్రవ్యోల్బణ సూచికలు వంటి కీలక డేటా సేకరణలు నిలిపివేయబడతాయి. దీని వల్ల మార్కెట్‌లలో అనిశ్చితి పెరుగుతుంది. దీంతో, ఎంత మేరకు నష్టం వాటిల్లుతుందో అనే ఆందోళన అమెరికన్లలో నెలకొంది.

గతంలో.. అమెరికా 1981 నుంచి ఇప్పటివరకు 15 సార్లు షట్‌డౌన్‌ను ఎదుర్కొంది(అన్నీ తక్కువ రోజుల వ్యవధిలోనే). 2018లో మాత్రం ట్రంప్ హయాంలో బోర్డర్ వాల్ డిమాండ్ కారణంగా 35 రోజుల షట్‌డౌన్ జరిగింది.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా అయితే ఇది ఎక్కువ రోజులు. ఇదిలా ఉండగా.. గత ఆరు సంవత్సరాల్లో ఫెడరల్‌ ప్రభుత్వం షట్‌డౌన్‌ కావడం ఇదే ప్రథమం.

ఎందుకీ షట్‌డౌన్‌?
ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. ప్రభుత్వం నడవడానికి అవసరమైన నిధులు కాంగ్రెస్‌ (House & Senate) ద్వారా ఆమోదించాలి. ఈ సంవత్సరం, రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు, కానీ డెమొక్రాట్లు ఆరోగ్య బీమా (Affordable Care Act) సబ్సిడీల పొడిగింపును కోరారు.  రిపబ్లికన్లేమో ఆ ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్‌ చర్చల నుంచి వేరుగా చర్చించాలని అన్నారు. దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందలేదు. ఫలితంగా.. ప్రభుత్వం నిధుల్లేకుండా నిలిచిపోయింది.

ఈ క్రమంలో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చారు. ‘‘షట్‌డౌన్ వస్తే, ఉద్యోగాల తొలగింపులు జరుగుతాయి. వాళ్లు డెమొక్రాట్లు అవుతారు’’ అంటూ ఆయన హెచ్చరించారు(Trump on Shutdown). ఆ వెంటనే వైట్‌హౌస్‌ వర్గాలు ఫెడరల్‌ ఏజెన్సీలకు షట్‌డౌన్‌ ప్రణాళికలు అమలు చేయమని ఆదేశించాయి. సాధారణంగా నిధుల బిల్లు(Funding Bill) ఆమోదం పొందకపోతే.. ప్రభుత్వం వద్ద ఖర్చు చేయడానికి అధికారిక నిధులు ఉండవు. అప్పుడు షట్‌డౌన్ ఏర్పడుతుంది. షట్‌డౌన్ అనేది ప్రభుత్వ నిధుల కొరత వల్ల తాత్కాలికంగా సేవలు నిలిపివేయాల్సిన పరిస్థితి. ఇది ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై, అంతర్జాతీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement