కొత్త సంవత్సరం సందర్భంగా తాత, ముత్తాతల సమాధుల సందర్శన
కిమ్ తరువాత పగ్గాలు ఆమెకేనని ఊహాగానాలు
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూతురు కిమ్ జు యే మరోసారి బహిరంగంగా కనిపించారు. గురువారం కొత్త సంవత్సరం సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి తాత, ముత్తాతల సమా«ధిని ఆమె తొలిసారి బహిరంగంగా సందర్శించారు. తల్లిదండ్రులతో ముందు వరుసలో నిలబడి ‘కుముసుసన్’స్మారకానికి నమస్కరిస్తున్న చిత్రం శుక్రవారం ఆ దేశ ప్రభుత్వ మీడియాలో ప్రచురితమైంది. 41 ఏళ్ల కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాను పరిపాలిస్తున్న తన కుటుంబంలోని మూడోతరం నాయకుడు. 2022 నవంబర్‌లో మొదటిసారిగా కిమ్ కుమార్తె ప్రభుత్వ మీడియాలో కనిపించారు.
అప్పటినుంచి పైనిక కవాతులు, క్షిపణి ప్రయోగాలతో సహా అనేక కార్యక్రమాల్లో తన తండ్రితో పాటు పాల్గొంటున్నారు. గతేడాది సెప్టెంబర్‌లోకిమ్ చైనా పర్యటనలోనూ ఆమె వెంట ఉన్నారు. కిమ్ ఇంకా చిన్న వయసులోనే ఉన్నారు. ఆయనకెలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవు. దానికి తోడు ఉత్తర కొరియా అత్యంత పురుషాధిక్య స్వభావం కలిగిన దేశం. అలాంటిది కిమ్ తన కుమార్తెను బయటి ప్రపంచానికి పదేపదే కనిపించేలా చేయడం ఆశ్చర్యం కలిగిండచంతోపాటు చర్చనీయాంశం కూడా అయ్యింది. కుటుంబ పాలనను విస్తరించాలనే ఆలోచనలకు ప్రజల మద్దతును పెంచుకోవడం కోసమే కిమ్ ఇలా కూతురును ముందుకు తెస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.


