- కరెన్సీ విలువ తగ్గిపోవడం, ధరల పెరుగుదలపై ఆందోళన
- దేశవ్యాప్తంగా నిరసన, హింసాకాండ
- ఘర్షణల్లో ఏడుగురి మృతి
- సుప్రీం లీడర్ ఖమేనీ తక్షణమే దిగిపోవాలని జనం డిమాండ్
టెహ్రాన్: ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కావడం, అమెరికా డాలర్‌తో ఇరానియన్ రియాల్ విలువ భారీగా పడిపోవడం, తద్వారా ధరలు ఎగబాకడం, జీవన వ్యయం పెరిగిపోవడం పట్ల జనం అసంతృప్తితో రగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచి్చ, ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇది క్రమంగా జెన్‌జీ ఉద్యమంగా రూపుదాలుస్తుండడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఉద్యమంలో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. ప్రభుత్వ వాహనాలను దహనం చేస్తున్నారు. సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని పట్టుబడుతున్నారు. బుధవారం, గురువారం నాలుగు నగరాల్లో నిరసనకారులకు, భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.
ఈ ఘటనలో కనీసం ఏడుగురు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం పట్టణాల నుంచి పల్లెలకు పాకుతోంది. మరోవైపు నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. భద్రతా దళాలు విరుచుకుపడుతున్నాయి. దాంతో రాజధాని టెహ్రాన్‌లో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినప్పటికీ ఇతర ప్రాంతాలకు ఉద్యమం విస్తరిస్తోంది. ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చాలని, ధరలు తగ్గించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. వ్యాపార వర్గాలు సైతం ఈ పోరాటానికి అండగా నిలుస్తున్నాయి.
పాతాళానికి రియాల్ విలువ
డాలర్‌తో పోలిస్తే రియాల్ విలువ రోజురోజుకీ పడిపోతోంది. ప్రస్తుతం ఒక డాలర్ విలువ 42,125 రియాల్స్‌గా నమోదయ్యింది. ఇటీవలి కాలంలో ఇదే కనిష్టం. ఇరాన్‌పై అమెరికాతోపాటు పశ్చిమ దేశాల కఠిన ఆంక్షల ఫలితంగానే ఈ దుస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్‌లో 2022 తర్వాత ప్రజా ఉద్యమం రగులుకోవడం ఇదే మొదటిసారి. అప్పట్లో హిజాబ్ ధరించనందుకు 22 ఏళ్ల మాషా అమీనీ అనే యువతిని పోలీసులు నిర్బంధించారు. ఆమె పోలీసు కస్టడీలో గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందడం సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పెద్ద ఎత్తున హింసాకాండ చోటుచేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది.
నిరసనకారుల వద్ద అక్రమ ఆయుధాలు
భద్రతా సిబ్బంది దాడిలో ఏడుగురు మరణించడం పట్ల జనం మండిపడుతున్నారు. తమ పోరాటం ఉధృతం చేస్తామని తేలి్చచెబుతున్నారు. గురువారం లారెస్తాన్ ప్రావిన్స్‌లోని అజ్నా సిటీలో నిరసన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మరణించారు. బక్తియారీ ప్రావిన్స్‌లోని లార్డెగాన్ నగరంలోనూ కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఇస్ఫాహాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఫులద్‌షహర్‌లో ఒకరు బలయ్యారు. మరోవైపు జనం దాడిలో ఇద్దరు పారామిలటరీ గార్డులు మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. కౌహదస్త్ నగరంలో 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురు నిరసనకారుల వద్ద అక్రమ ఆయుధాలను స్వా«దీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
విదేశీ జోక్యాన్ని సహించం: ఇరాన్
ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తిప్పి కొట్టారు. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని తేలి్చచెప్పారు. తమ సమస్యలను శాంతియుతంగా చర్చలతో పరిష్కరించుకొనే సామర్థ్యం తమకు ఉందన్నారు. ఇరాన్ వ్యవహారాల్లో అనవసరంగా కలుగుజేసుకోవాలని చూడడం సరైంది కాదని సూచించారు.
ఇతర దేశాలు ఈ విషయం గుర్తించాలని పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు. ఇరాన్‌లో అలజడికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే కారణమని ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ ఆరోపించారు. తమ అంతర్గత వ్యవహారాల్లో తలదూరిస్తే అమెరికా అంతిమంగా ప్రయోజనాలే దెబ్బతింటాయని స్పష్టంచేశారు. గత ఏడాది జూన్‌లో ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులకు దిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
చర్చలకు సిద్ధమన్న ప్రభుత్వం
ఇరాన్ కరెన్సీ విలువ పడిపోకుండా కాపాడే విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంకేతాలిచ్చారు. పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందని, ప్రజలు శాంతించాలని కోరారు. నిరసనకారులతో చర్చలకు సిద్ధంగా ఉన్న ట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఘర్షణలో మృతిచెందినవారి అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి చావు తప్పదంటూ ఈ సందర్భంగా జనం నినాదాలు చేశారు.
హద్దు మీరితే జోక్యం: ట్రంప్
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నవారిపై ఆయుధాలు ప్రయోగిస్తే తాము జోక్యం చేసుకోక తప్పదని ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాతో పోస్టు చేశారు. ప్రజా ఉద్యమం పట్ల ప్రభుత్వం సంయమనం పాటించాలని సూచించారు. ప్రజలపై హద్దు మీరి ప్రవర్తిస్తే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందన్నారు. నిరసనకారులను కాపాడుకుంటామన్నారు. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామనిహెచ్చరించారు.


