
అమెరికా ప్రభుత్వం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలో ఆరేళ్ల తర్వాత షట్‌డౌన్‌లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో భారత వాణిజ్యంపై పడే ప్రభావాల గురించి చర్చ జరుగుతోంది. అమెరికా షట్‌డౌన్ ప్రభావం భారత వాణిజ్యంపై తప్పకుండా ఉంటుంది. అయితే ఆ ప్రభావం తీవ్రత షట్‌డౌన్ ఎంత కాలం కొనసాగుతుందనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ అంటే ఏమిటి?
అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ (Government Shutdown) అంటే ఫెడరల్ ప్రభుత్వానికి తాత్కాలికంగా నిధులు నిలిచిపోవడం అని అర్థం. అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు కేటాయించడానికి అక్కడి పార్లమెంట్ (కాంగ్రెస్) ‘బడ్జెట్ బిల్లులు’ లేదా ‘అప్రాప్రియేషన్ బిల్లులు’ ఆమోదించాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ నిధుల బిల్లులు ఆమోదం పొందాలి.
ఒకవేళ కాంగ్రెస్ (సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) తమలో తాము విభేదాల కారణంగా లేదా రాజకీయ కారణాల వల్ల ఆ గడువులోపు ఈ బిల్లులను ఆమోదించడంలో విఫలమైతే, ప్రభుత్వం వద్ద ఖర్చు చేయడానికి చట్టబద్ధంగా నిధులు ఉండవు. నిధులు లేకపోవడంతో అమెరికాలోని అత్యవసరం కాని (Non-Essential) అన్ని ప్రభుత్వ విభాగాలు, సర్వీసులు నిలిచిపోతాయి (షట్‌డౌన్ అవుతాయి).
ఎందుకు ఇలా జరుగుతుంది?
ప్రధానంగా పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విభేదాలు తీవ్రంగా ఉన్నప్పుడు షట్‌డౌన్ ఏర్పడుతుంది. ఆరోగ్య సంరక్షణ, రక్షణ, సరిహద్దు భద్రత లేదా వలస విధానాల వంటి అంశాలపై ఏ పార్టీ ఎంత ఖర్చు చేయాలనే విషయంలో రాజీ కుదరకపోతే ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి. నిధుల బిల్లు ఆమోదాన్ని అడ్డుకుని తమకు కావాల్సిన ఇతర రాజకీయ డిమాండ్లు లేదా విధాన మార్పులను బడ్జెట్‌లో చేర్చాలని ఏదైనా ఒక పార్టీ పట్టుబడితే కూడా షట్‌డౌన్ వస్తుంది.
ఈ సమయంలో ఏం జరుగుతుంది?
అత్యవసరం కాని సేవలు నిలిపేస్తారు. జాతీయ పార్కులు మూసివేస్తారు. మ్యూజియంలు, అనేక ప్రభుత్వ కార్యాలయాలు మూతపడతాయి. పరిశోధన, గ్రాంట్ల జారీ, కొన్ని రకాల నియంత్రణ (Regulatory) తనిఖీలు నిలిచిపోతాయి. అయితే అత్యవసర సేవలను మాత్రం కొనసాగిస్తారు. జాతీయ భద్రత, సైనిక కార్యకలాపాలు, విమాన రాకపోకల నియంత్రణ (Air Traffic Control), సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయి.
ఉద్యోగులపై ప్రభావం
అత్యవసరం కాని విభాగాల్లోని లక్షలాది మంది ఉద్యోగులకు జీతాలు లేకుండా సెలవు (Furlough) ఇస్తారు. అత్యవసర విధుల్లో ఉన్న ఉద్యోగులు జీతం లేకుండా పనిచేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ షట్‌డౌన్ తర్వాత ఆమోదాన్నిబట్టి వారికి తర్వాత జీతాలు చెల్లిస్తారు. షట్‌డౌన్ అనేది అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచ దేశాలకు అనిశ్చితిని కలిగించే ఒక అరుదైన రాజకీయ సంక్షోభం.
భారత వాణిజ్యంపై ప్రభావం
సాధారణంగా షట్‌డౌన్ కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు మాత్రమే ఉంటే భారత వాణిజ్యంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఈ వార్తల కారణంగా ప్రపంచ మార్కెట్లు ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు, డాలర్ విలువలో అస్థిరత ఏర్పడవచ్చు. దీని ఫలితంగా భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా కొంత ఒడిదుడుకులకు లోనుకావచ్చు. షట్‌డౌన్ కారణంగా కీలకమైన అమెరికా ఆర్థిక డేటా (ఉదాహరణకు ఉద్యోగాల నివేదికలు, ద్రవ్యోల్బణం లెక్కలు) విడుదల ఆలస్యం కావచ్చు. ఈ డేటా ఆధారంగానే పెట్టుబడిదారులు, సెంట్రల్ బ్యాంకులు (ఫెడ్) నిర్ణయాలు తీసుకుంటాయి. కాబట్టి ఈ అనిశ్చితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
వీసా, ఇమ్మిగ్రేషన్ సేవల్లో ఆలస్యం
అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు నెమ్మదిస్తే భారతీయ వృత్తి నిపుణులకు లేదా వ్యాపారవేత్తలకు సంబంధించిన వీసా, ఇమ్మిగ్రేషన్ సేవల్లో ఆలస్యం జరగవచ్చు. భారతీయ కంపెనీలకు అమెరికాలో అవసరమైన కొన్ని నియంత్రణ అనుమతులు (Regulatory Approvals) లేదా లైసెన్సుల జారీలో ఆలస్యం ఏర్పడవచ్చు.
ఇదీ చదవండి: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్‌బీఐ