
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్కెట్ వర్గాలు ఊహించినట్లే ఈసారి రెపో రేటును మార్చకుండా స్థిరంగా ఉంచింది. ఇప్పటికే ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్‌లో జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 100 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఆగస్టులో జరిగిన సమావేశంలో వడ్డీరేట్లను స్థిరంగా ఉంచారు. సెప్టెంబర్ 29న ప్రారంభమైన ఎంపీసీ అక్టోబర్ 1న ముగిసింది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అందులోని అంశాలను పేర్కొన్నారు. రెపో రేటును 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు చెప్పారు.
స్థిరమైన రేట్లకు కారణాలు..
రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠ స్థాయిలోనే ఉంది. భారతీయ ఎగుమతులపై అమెరికా సుంకాలు సహా మునుపటి కోతలు, ప్రపంచ అనిశ్చితుల ప్రభావాన్ని అంచనా వేయాలని ఆర్‌బీఐ భావిస్తుంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో లోన్ ఈఎంఐలు ప్రస్తుతానికి నిలకడగా ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ వృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణ నేతృత్వంలోని అంతరాయాల నుంచి వచ్చే ప్రమాదాలపై విధాన నిర్ణేతలు జాగ్రత్త వహించినట్లు తెలుస్తుంది.
ఆర్‌బీఐ పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన అనంతరం, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తనకు ఐదో ద్రవ్య విధాన కమిటీ సమావేశం. తాను పదవి చేపట్టిన తర్వాత ముందుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో రెపో రేటును గడిచిన ఐదేళ్లలో తొలిసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఏప్రిల్‌లోనూ మరోసారి అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్‌బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. జూన్‌లోనూ మరో 50 బేసిస్ పాయింట్లు కోత విధించింది. ఆగస్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో బెంచ్‌మార్క్ రుణ రేటు 5.5 శాతానికి చేరింది.
రెపో రేటు అంటే..
రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్‌పై ప్రభావం చూపినప్పుడు ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతుంది. రెపో రేటు తగ్గితే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటు తగ్గిస్తాయి. దీంతో రిటైల్, కార్పొరేట్ రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం తగ్గుతుంది.
ఇదీ చదవండి: నవరాత్రులు.. పెట్టుబడి పాఠాలు