
నవరాత్రుల్లో ప్రతి రోజు ఒక్కో వర్ణానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మనం అంతా కోరుకునే ప్రశాంతత, శక్తి, వృద్ధిని ప్రతిబింబింజే విధంగా ఇవి ఉంటాయి. డబ్బు, పెట్టుబడుల విషయంలో పాటించాల్సిన విధానాలకు కూడా ఈ వర్ణాలు ప్రతిబింబించే గుణాలు ప్రాతిపదికగా నిలుస్తాయి. వీటిని అలవర్చుకుంటే ఆర్థిక ప్రయాణం కూడా రంగులమయంగా, సమతూకంగా ఉంటుంది. నవరాత్రులు(Navaratri), తొమ్మిది వర్ణాలు, అవి నేర్పే పెట్టుబడుల పాఠాల(personal finance) గురించి ఒకసారి చూద్దామా..
1వ రోజు – తెలుపు: తెలుపు స్వచ్ఛత, ప్రశాంతత, భద్రత, స్పష్టతకు చిహ్నం. ఆర్థిక కోణంలో చూస్తే సురక్షితమైన పునాదులతోనే ప్రశాంతత లభిస్తుంది. రిస్కు సామర్థ్యాలను అర్థం చేసుకుని, ఈక్విటీ–డెట్–హైబ్రిడ్ ఫండ్స్‌వ్యాప్తంగా సరైన కేటాయింపులు చేయడం ద్వారా ఈ భద్రత మొదలవుతుంది. పటిష్టమైన పునాదులపై నిర్మించిన ఇల్లు ఎలాగైతే తుఫాన్లయినా తట్టుకుని నిలబడుతుందో, క్రమశిక్షణతో కూడుకున్న పోర్ట్‌ఫోలియో అనేది, మార్కెట్లు అనూహ్యంగా మారినా కూడా స్థిరత్వాన్ని అందిస్తుంది.
2వ రోజు – ఎరుపు: ఎరుపు వర్ణం శక్తిని, సంకల్పాన్ని సూచిస్తుంది. సంపద సృష్టించాలంటే స్వల్పకాలిక సవాళ్లను పట్టించుకోకుండా దీర్ఘకాలిక విజన్‌పై దృష్టి పెట్టాలి. సాధారణంగా మార్కెట్లో ఒడిదుడుకులనేవి, ఇన్వెస్టర్లను భయపెట్టేస్తాయి. కానీ వెనుకడుగు వేయకుండా స్థిరంగా నిలబడటమే శక్తి. ఈక్విటీ ఫండ్స్ స్వల్పకాలికంగా హెచ్చుతగ్గులకు లోనైనా కాలక్రమేణా, మీ పోర్ట్‌ఫోలియోను శక్తివంతంగా, స్థిరంగా తీర్చిదిద్దుతాయి. ధైర్యం అంటే దుస్సాహసాలు చేయడం కాదు, భయం వెనక్కి లాగినా, మన సంకల్పానికి కట్టుబడి ఉండాలని ఎరుపు వర్ణం సూచిస్తుంది.
3వ రోజు – నీలం: ఈ రంగు నమ్మకానికి, స్థిరత్వానికి చిహ్నంగా నిలుస్తుంది. ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ పెట్టుబడులవ్యాప్తంగా వైవిధ్యాన్ని పాటించడం ద్వారా పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వం లభిస్తుంది. నీలం వర్ణం ఏ విధంగానైతే విశాలమైన ఆకాశం, లోతైన మహాసముద్రాలను ప్రతిఫలిస్తుందో, అదే విధంగా డైవర్సిఫికేషన్ కూడా పెట్టుబడుల పరిధిని మరింత విస్తృతం చేసి, ఎలాంటి ఒడిదుడుకులనైనా అధిగమించే శక్తిని అందిస్తుంది.
4వ రోజు – పసుపు: పసుపు అనేది ఆశావహ భావాన్ని, సరికొత్త ప్రారంభాలను సూచిస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, సిప్‌ను ప్రారంభించడం కావచ్చు, లేదా రిటైర్మెంట్ ప్రణాళికను ప్రారంభించడం కావచ్చు, ప్రతి ఇన్వెస్టరు ప్రస్థానంలో మొదటి అడుగు అనేది ఉంటుంది. ఈ ఆరంభాలు చాలా చిన్నవిగా అనిపించవచ్చు, కానీ కొత్త మార్పునకు శ్రీకారంగా నిలుస్తాయి. చిన్న చిన్న అలవాట్లే దీర్ఘకాలంలో ఆర్థికంగా సానుకూల భావాన్ని పెంపొందిస్తాయి.
5వ రోజు – ఆకుపచ్చ (వృద్ధి): ఆకుపచ్చని వర్ణమనేది ప్రకృతిని, సమృద్ధిని సూచిస్తుంది. ఆర్థిక విషయాలను పరిశీలిస్తే, డబ్బును నిరుపయోగంగా ఉంచడమంటే విత్తనాన్ని నాటకుండా ఉంచినట్లే. సరైన వాతావరణంలో విత్తనాన్ని నాటితే వృద్ధి లోకి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌ను వివేకవంతంగా ఎంచుకుంటే, దీర్ఘకాలిక వృద్ధికి సారవంతమైన క్షేత్రం లభించినట్లవుతుంది. నారు ఎలా అయితే వృక్షంగా ఎదుగుతుందో, కాంపౌండింగ్ కూడా అలాగే నిశ్శబ్దంగా పని చేస్తుంది. హరిత వర్ణమనేది సహనాన్ని, స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. హడావిడి పడితే కాదు ఓర్పుగా సాగు చేస్తేనే స్థిరమైన సంపద వస్తుందని తెలియజేస్తుంది.
6వ రోజు – బూడిద వర్ణం: ఈ వర్ణం కాంతిని, నీడను, రెండింటినీ సూచిస్తుంది. జీవితమంటే కేవలం సూర్య కాంతి వెలుగులే కాదు తుఫాన్ల చీకట్లు కూడా ఉంటాయని గుర్తు చేస్తుంది. వీటిని అధిగమించే క్రమంలో క్రమశిక్షణతో బడ్జెట్ వేసుకోవడం, ఇన్వెస్టింగ్ చేయడం ద్వారా ఆర్థికాంశాల్లో సమతౌల్యత వస్తుంది. నెలవారీ సిప్‌లాంటివి మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ పొదుపు, మదుపు కొనసాగేలా చూస్తాయి.
7వ రోజు – నారింజ: ఈ రంగు శక్తి, ఉత్సాహం, క్రియాశీలతను సూచిస్తుంది. క్రియాశీలకంగా సకాలంలో చర్య తీసుకోవాలని ఆర్థిక పరిజ్ఞానం సూచిస్తుంది. పెట్టుబడులు ఎంత ముందుగా ప్రారంభిస్తే, కాంపౌండింగ్ అంత శక్తివంతంగా ఉంటుంది. ఏ కాస్త జాప్యం చేసినా సరే, దీర్ఘకాలికంగా సంపదను సృష్టించుకోవడంలో భారీ తేడా వస్తుంది. ‘‘సరైన సమయం’’ కోసం నిరీక్షిస్తూ కూర్చోకుండా, వెంటనే రంగంలోకి దిగాలని నారింజ వర్ణం సూచిస్తుంది.
8వ రోజు – నెమలి ఆకుపచ్చ: ఈ వర్ణం హుందాతనం, వివేకం, ఆకాంక్షలను సూచిస్తుంది. వెల్త్ మేనేజ్‌మెంట్‌లో ఆకాంక్షలను, దూరదృష్టితో మేళవించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. సంపదను పెంచుకోవాలనే కోరికకు ఆకాంక్ష ఓ చోదకంగా నిలుస్తుంది. అదే సమయంలో మన ఎంపికలు దీర్ఘకాలంలో నిలబడగలిగేవిగా ఉండేలా వివేకం చూస్తుంది. స్వల్పకాలిక ధోరణుల మాయలో పడకుండా, జీవిత లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులపై ఫోకస్ చేయడానికి ఇవి కీలకం.
9వ రోజు – గులాబీ: గులాబీ వర్ణమనేది ప్రేమ, సంరక్షణను సూచిస్తుంది. పిల్లల చదువులు, రిటైర్మెంట్ ప్రణాళికలు, కుటుంబానికి బీమా భద్రత కల్పించడం ఇలా ప్రతి ఆర్థిక లక్ష్యం వెనుక ప్రేమ దాగి ఉంటుంది. ఆయా లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేయడం కూడా ప్రేమను ఆర్థిక కోణంలో వ్యక్తపర్చడమే అవుతుంది. గులాబీ రంగు అనేది పెట్టుబడులంటే అంకెలు, లెక్కలు కాదని, చేసిన హామీలను నిలబెట్టుకోవడమని తెలియజేస్తుంది.
చివరిగా చెప్పాలంటే, ఆధ్యాత్మికత, క్రమశిక్షణ ఒకదాని వెంటే ఒకటి ఉంటాయని నవరాత్రులు తెలియజేస్తాయి. క్రమశిక్షణతో పెట్టుబడులు పెడితే, ఆర్థికంగా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచి్చనా ధైర్యంగా ఎదుర్కొనగలిగే శక్తిని అందిస్తాయి. సంపద సృష్టి అనేది ఏదో ఒక్క రోజుతో తేలిపోయే వ్యవహారం కాదు. స్థిరంగా, ఓపికగా, స్పష్టతతో ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకు సాగే ప్రస్థానం.
నవరాత్రులు అందరికీ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, సమృద్ధిని అందించాలని కోరుకుంటూ, శుభాభినందనలు.
ఇదీ చదవండి: మరో పావు శాతం రేట్ల కోత ఉంటుందా?