
మరో పావు శాతం రేట్ల కోత ఉంటుందా?
ఎస్‌బీఐ రీసెర్చ్ అంచనా..
బుధవారం పాలసీ నిర్ణయం వెల్లడి..
రుణ గ్రహీతలకు మరింత ఊరటనిచ్చేలా.. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) పాలసీ వడ్డీరేట్లను మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ అంచనా వేసింది. ప్రస్తుతానికి ఆర్‌బీఐకి ఇదే సరైన ఆప్షన్ అని పేర్కొంది. అయితే, మరికొంత మంది ఆర్థిక నిపుణులు మాత్రం పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ సారి కూడా రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ ఎంపీసీ మూడు రోజుల సమావేశం నేటి నుంచి ప్రారంభమవుతోంది. అక్టోబర్ 1న (బుధవారం) పాలసీ నిర్ణయం వెలువడుతుంది. ఒకపక్క భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మరో పక్క, భారత్ ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకం విధించిన నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా పాలసీ సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.
ఫిబ్రవరి నుంచి మూడు సార్లు...
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ నెల ఫిబ్రవరిలో జరిగిన తొలి ఎంపీసీ భేటీలోనే దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత రెపో రేటును పావు శాతం తగ్గించారు. ఆ తర్వాత ఏప్రిల్లో పావు శాతం మళ్లీ జూన్‌లో ఏకంగా అర శాతం తగ్గింపుతో ఇప్పటిదాకా 1 శాతం రెపో రేటు దిగొచ్చింది. ప్రస్తుతం 5.5 శాతంగా కొనసాగుతోంది. ఆర్‌బీఐ చర్యల నేపథ్యంలో బ్యాంకులు కూడా రేట్ల కోత ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బదలాయించాయి. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు కాస్త దిగొచ్చాయి. అయితే, అమెరికా సుంకాల మోత, ఇతర భౌగోళిక రాజీకయ పరిణామాల ప్రభావవంతో ఆగస్టు పాలసీ సమావేశంలో ఆర్‌బీఐ రేట్లను యథాతథంగా కొనసాగించింది.
ద్రవ్యోల్బణం ఊరట...
ప్రస్తుతం ధరలు పూర్తిగా అదుపులో ఉండటంతో పాటు వచ్చే ఏడాది కూడా రిటైల్ ద్రవ్యల్బణం కట్టడిలోనే ఉండొచ్చని, ఈ నేపథ్యంలో తాజా పాలసీ సమీక్షలో మరో పావు శాతం రెపో కోతకు ఆస్కారం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ పేర్కొంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 2.07 శాతంగా, టోకు ధరల ద్రవ్యోల్బణం 0.52 శాతం నమోదైన సంగతి తెలిసిందే. ‘రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ టార్గెట్ 4 శాతంగానే (2 శాతం అటు ఇటుగా) ఉంది. జీఎస్‌టీ 2.0కి ముందు, ఆ తర్వాతా ఇదే పరిస్థితి. మరోపక్క, వృద్ధి రేటు స్థిరంగా 6.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నప్పటికీ, టారిఫ్‌ల ప్రభావంతో తగ్గే అవకాశం లేకపోలేదు. ఈ తరుణంలో ప్రస్తుతం యథాతథ స్థితికే చాన్సుంది. మార్కెట్ వర్గాలు మాత్రం మరో పావు శాతం కోతను ఆశిస్తున్నాయి’ అని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవీస్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!
‘జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రభావంతో రిటైల్ ద్రవ్యోల్బణం రానున్న నాలుగు త్రైమాసికాల్లో పావు శాతం నుంచి అర శాతం దిగిరావచ్చు. జీఎస్‌టీ రేట్ల హేతుబద్దీకరణ వల్ల డిమాండ్ భారీగా పుంజుకోనుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఆర్‌బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు‘ అని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ చెప్పారు. అయితే, జీఎస్‌టీ రేట్ల మార్పు, ద్రవ్యోల్బణం అంచనాల కంటే దిగువనే కొనసాగుతుండటంతో పావు శాతం రెపో కోతను అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ ధర్మకృతి జోషి పేర్కొన్నారు.