
అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్(USA Shutdown) మొదలైంది. నిధుల బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో.. బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30కి) ఫెడరల్ సేవలు నిలిచిపోయాయి. దీంతో.. 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు మొదలయ్యాయి.
అర్ధరాత్రి దాకా కీలకమైన నిధుల బిల్లు(Funding Bill) విషయంలో సెనేట్‌లో హైడ్రామా నడిచింది. రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల మధ్య ఎంతకీ పొంతన కుదరలేదు. దీంతో సెనేట్ తాత్కాలిక నిధుల బిల్లును తిరస్కరించగా.. షట్‌డౌన్ ఆందోళన నడుమ ఫెడరల్ సేవలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే.. గత ఆరుసంవత్సరాల్లో ఫెడరల్ ప్రభుత్వం షట్‌డౌన్ కావడం ఇదే.
ఎందుకీ షట్‌డౌన్?
ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. ప్రభుత్వం నడవడానికి అవసరమైన నిధులు కాంగ్రెస్ (House & Senate) ద్వారా ఆమోదించాలి. ఈ సంవత్సరం, రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు, కానీ డెమొక్రాట్లు ఆరోగ్య బీమా (Affordable Care Act) సబ్సిడీల పొడిగింపును కోరారు. రిపబ్లికన్లేమో ఆ ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్ చర్చల నుంచి వేరుగా చర్చించాలని అన్నారు. దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందలేదు. ఫలితంగా.. ప్రభుత్వం నిధుల్లేకుండా నిలిచిపోయింది.
ఈ క్రమంలో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చారు. ‘‘షట్‌డౌన్ వస్తే, ఉద్యోగాల తొలగింపులు జరుగుతాయి. వాళ్లు డెమొక్రాట్లు అవుతారు’’ అంటూ ఆయన హెచ్చరించారు(Trump on Shutdown). ఆ వెంటనే వైట్‌హౌస్ వర్గాలు ఫెడరల్ ఏజెన్సీలకు షట్‌డౌన్ ప్రణాళికలు అమలు చేయమని ఆదేశించాయి.
సాధారణంగా నిధుల బిల్లు(Funding Bill) ఆమోదం పొందకపోతే.. ప్రభుత్వం వద్ద ఖర్చు చేయడానికి అధికారిక నిధులు ఉండవు. అప్పుడు షట్‌డౌన్ ఏర్పడుతుంది. షట్‌డౌన్ అనేది ప్రభుత్వ నిధుల కొరత వల్ల తాత్కాలికంగా సేవలు నిలిపివేయాల్సిన పరిస్థితి. ఇది ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై, అంతర్జాతీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది.
📌షట్‌డౌన్ ఎందుకు జరుగుతుంది?
రాజకీయ విభేదాలు వల్ల బడ్జెట్ బిల్లు ఆమోదం పొందకపోవడం
పార్టీల మధ్య రాజీ లేకపోవడం
ప్రాధాన్యతలపై విభేదాలు.. ఉదాహరణకు ఆరోగ్య సంరక్షణ, పన్ను విధానాలు, వలస చట్టాలు
🛑 షట్‌డౌన్ జరిగితే..
నాన్-ఎసెన్షియల్ (అత్యవసరంకాని) సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి
ఫెడరల్ ఉద్యోగులుకి వేతనం లేకుండా సెలవు ఇవ్వబడుతుంది
ప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియంలు, జాతీయ పార్కులు మూసేస్తారు
వీసా ప్రాసెసింగ్, రుణాల మంజూరు, పరిశోధన కార్యక్రమాలు ఆలస్యమవుతాయి
👨✈️ ఎవరిపై ప్రభావం ఉండదు?
సైనికులు, సరిహద్దు అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు వంటి అత్యవసర సేవల ఉద్యోగులు పని చేస్తారు. కానీ జీతాలు తర్వాతే చెల్లిస్తారు
సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి సేవలు కొనసాగుతాయి
🕰️ గతంలో..
అమెరికా 1981 నుంచి ఇప్పటివరకు 15 సార్లు షట్‌డౌన్‌ను ఎదుర్కొంది(అన్నీ తక్కువ రోజుల వ్యవధిలోనే)
2018లో మాత్రం ట్రంప్ హయాంలో బోర్డర్ వాల్ డిమాండ్ కారణంగా 35 రోజుల షట్‌డౌన్ జరిగింది.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా అయితే ఇది ఎక్కువ రోజులు
ఇదీ చదవండి: ఓహో.. ట్రంప్‌తో మునీర్ అంత మాట అన్నాడా?