
అసిమ్ మునీర్ పాకిస్తాన్‌లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి
ఆయన ప్రశంసలను గొప్ప గౌరవంగా భావిస్తున్నా: ట్రంప్
వాషింగ్టన్: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన ఘర్షణ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. ఆ రెండు దేశాల నడుమ అతిపెద్ద యుద్ధాన్ని తానే ఆపేశానని మరోసారి తేల్చిచెప్పారు. రెండు అణ్వస్త్ర దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించానని చెప్పారు. మంగళవారం మిలటరీ కమాండర్ల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు.
యుద్ధాన్ని ఆపడం ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడారంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ తనను ప్రశంసించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. అసిమ్ మునీర్ మాట్లాడిన విధానం తనకు ఎంతగానో నచ్చిందని అన్నారు. అసిమ్ మునీర్ పాకిస్తాన్‌లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని ట్రంప్ తేల్చిచెప్పారు.
తాను రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలు ఆపేశానని పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా భారత్–పాక్‌ల యుద్ధమే ఉందన్నారు. భారత్, పాక్ ఘర్షణలో ఏడు యుద్ధ విమానాలు నేలకూలాయని వెల్లడించారు. అయితే, అవి ఏ దేశానికి చెందినవన్న సంగతి బయటపెట్టలేదు. మరోవైపు ఆపరేషన్ సిందూర్‌కు విరామం ఇవ్వడం వెనుక అమెరికా ప్రమేయం లేదని, పాకిస్తాన్ సైన్యం కాళ్లబేరానికి వచ్చి వేడుకోవడం వల్లే వైమానిక దాడులు నిలిపివేశామని భారత ప్రభుత్వం ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.