
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో..మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నారు. భారత్-రష్యా సంబంధాలపై తాజాగా విమర్శలు గుప్పించారు. భారత్ ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కాదంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా తియాంజిన్ (Tianjin) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు వేదికగా ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ దరిమిలా ఈ భేటీని సిగ్గుచేటుగా అభివర్ణిస్తూ.. పీటర్ నవారో తీవ్ర విమర్శలు చేశారు.
వాషింగ్టన్‌లో జరిగిన మీడియా సమావేశంలో నవారో మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీ.. పుతిన్, షీ జిన్‌పింగ్‌లతో కలిసి ఉండటం సిగ్గుచేటు. ఆయన ఏమి ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ, భారత్ కలిసి ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కానేకాదు అని అన్నారు.
అమెరికా విధించిన టారిఫ్‌లపై భారత్ స్పందించిన తీరు.. అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు కొనసాగించడాన్ని నవారో తీవ్రంగా విమర్శించారు. భారత్ ముడి చమురు కొనుగోలు ద్వారా పుతిన్ యుద్ధానికి నిధులు సమకూర్చుతోంది అని మరోసారి ఆరోపించారు. భారత్‌ను సుంకాల మహరాజుగా అభివర్ణించిన ఆయన.. రష్యా చమురు కొనుగోలు విషయంలో వాస్తవాల్ని దాచిపెడుతోందని అన్నారు.
తాజాగా.. భారత్‌లో కుల వ్యవస్థను ప్రస్తావిస్తూ.. ఓ వర్గం సాధారణ ప్రజల ఖర్చుతో లాభపడుతోంది అంటూ తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఇండియన్ రిఫైనరీలు రష్యా రాయితీ ధరకు ముడి చమురును ప్రాసెస్ చేసి, అధిక ధరలకు ఎగుమతి చేస్తున్నాయని, ఇది "క్రెమ్లిన్ లాండ్రోమాట్"లా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రెమ్లిన్ లాండ్రోమాట్ ఆరోపణకు అర్థం ఏంటంటే.. భారత రిఫైనరీలు రష్యా డబ్బును "శుభ్రం" చేసి, ప్రపంచ మార్కెట్‌లో తిరిగి ప్రవేశపెడుతున్నాయి అని. తద్వారా రష్యా చమురు అమ్మకాలు కొనసాగుతాయని, పుతిన్‌కు ఆర్థిక లాభం కలుగుతుందని, ఇది ప్రత్యక్షంగా రష్యా యుద్ధ వ్యయానికి నిధులు సమకూర్చే మార్గంగా మారుతుందని ఆయన అభిప్రాయం.
అయితే.. భారత్ మాత్రం తన చమురు కొనుగోలు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై ధర పరిమితి విధించాయి. ఈ నేపథ్యంలో భారత్ రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. మిగతా దేశాల్లాగే జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని, దేశీయ మార్కెట్‌ను స్థిరంగా ఉంచేందుకు ఇది అవసరమని భారత్ అంటోంది. ఈ క్రమంలోనే అమెరికా విధించిన 50 శాతం సుంకాలను అన్యాయమని భారత్ అభిప్రాయపడుతోంది.