తూచ్‌ అదంతా ఉత్తినే.. జెలెన్‌స్కీకి ట్రంప్‌ ఝలక్‌ | US Donald Trump rejects Zelensky to Give Tomahawk missiles | Sakshi
Sakshi News home page

తూచ్‌ అదంతా ఉత్తినే.. జెలెన్‌స్కీకి ట్రంప్‌ ఝలక్‌

Oct 18 2025 9:19 AM | Updated on Oct 18 2025 10:51 AM

US Donald Trump rejects Zelensky to Give Tomahawk missiles

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి మాట మార్చారు. రష్యాను బెదిరించినట్టే వార్నింగ్‌ ఇచ్చి.. వెంటనే యూటర్న్‌ తీసుకున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ఆపకపోతే జెలెన్‌స్కీకి అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను ఇస్తామని ప్రకటించిన ట్రంప్‌.. తాజాగా అలాంటిదేమీ లేదని చేతులెత్తేశారు. దీంతో, మరోసారి అందరి ముందూ నవ్వులపాలయ్యారు.

ఇక,  రష్యా చేత ఎలా అయినా యుద్ధం ఆపించాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు. ఇందు కోసం ఇప్పటికే పలు రకాల ప్లాన్స్‌ వేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సైతం ట్రంప్‌ భేటీ అయ్యారు. కానీ, ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మాత్రం ఆడగం లేదు. ఈ నేపథ్యంలో రష్యా బెదిరించేందుకు ట్రంప్‌ కొత్త ప్లాన్‌ చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపకపోతే తమ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను జెలెన్‌స్కీకి ఇవ్వాల్సి వస్తుందని రష్యాను బెదిరించారు. ఇలా అయినా పుతిన్‌కు దారికి తెచ్చేందుకు పైకి గంభీరంగా ప్రకటన చేశారు.

అయితే, తాజాగా ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. ఓవల్ ఆఫీసులో అధ్యక్షుడు ట్రంప్‌ను జెలెన్‌స్కీ కలిశారు. ఈ సందర్బంగా తోమహాక్ క్షిపణులపై చర్చించారు. తమకు క్షిపణులను ఇవ్వాలని అందుకు బదులుగా తాము డ్రోన్లను ఇస్తామని జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు. కానీ, ట్రంప్ మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఊహించని షాక్‌ ఇచ్చారు. తోమహక్ క్షిపణులను ఇప్పుడు ఇవ్వలేనని ట్రంప్‌ తెగేసి చెప్పేశారు. తాజా పరిస్థితుల్లో అమెరికా నిల్వలను తగ్గించలేనని.. వాటిని సరి చూసుకోవాలని తెలిపారు. దాని కన్నా ముఖ్యంగా తనకు యుద్ధం ముగించడమే అత్యంత ముఖ్యమని తెలిపారు.

 

ఈ సందర్బంగా రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు తాను క్షిపణులను ఇవ్వలేనని చేతులెత్తేశారు. అయితే.. తోమహాక్ క్షిపణులు తమ దగ్గర ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శాంతి చర్చలను సీరియస్‌గా తీసుకునేలా చేయవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంటున్నారు. మరోవైపు, బుడాపెస్ట్‌లో సమావేశం తర్వాత క్షిపణుల గురించి ఆలోచిస్తానని ట్రంప్ దానికి బదులు చెప్పారని వైట్‌హౌస్ అధికారులు చెబుతున్నారు.‍ కాగా, ట్రంప్ తోమహాక్ క్షిపణుల నిరాకరణ వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక ఉందని తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు క్షిపణులను ఇస్తే అమెరికా-రష్యా సంబంధాలకు హాని కలుగుతుందని, దాని వలన యుద్ధం మరింత సీరియస్ అవుతుందే తప్ప ఏం ఉపయోగం లేదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement