
వాషింగ్టన్: భారత్‌ను టార్గెట్ చేసిన అమెరికా మరోసారి మన దేశంపై తన అక్కసును వెళ్లగక్కింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి భారత్ ప్రధాన కారణం అంటూ వైట్‌హౌస్ సలహాదారు పీటర్ నవారో సంచలన ఆరోపణలు గుప్పించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ‘మోదీ యుద్ధం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో అమెరికా సుంకాల నుంచి భారత్ తప్పించుకోవాలంటే రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం వెంటనే ఆపేయాలని సూచనలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
వైట్‌హౌస్ సలహాదారు పీటర్ నవారో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు భారత్ ప్రధాన కారణం. రష్యా నుంచి రాయితీపై భారత్ ముడిచమురు కొనుగోలు చేయడంతో యుద్ధంలో పుతిన్ దూకుడుగా వ్యవహరించారు. భారత్ అలా కొనుగోలు చేయకపోతే యుద్ధం ఇంత కాలం కొనసాగేది కాదు. ఇది మోదీ యుద్ధం. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపేయాలి. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్యలకు భారత్ కూడా సహకరించాలి. మోదీ తీరు విచిత్రంగా ఉంది. రష్యా విషయంలో మోదీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు.
Trump Adviser Peter Navarro: Everyone in America loses because of India buys oil from Russia. US taxpayers have to send money for Modi’s war in Ukraine
Anchor (confused): You mean Putin’s war?
Navarro: No I mean Modi’s war! pic.twitter.com/HVE8EO7W8g— Shashank Mattoo (@MattooShashank) August 28, 2025
ఇరుదేశాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే.. భారత్ కూడా అందుకు సహకరించాల్సి ఉంటుంది. భారత్ చర్యల వల్ల అమెరికా పన్ను చెల్లింపుదారులు నష్టపోవాల్సి వస్తుంది. ఒకవేళ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును నిలిపివేస్తే.. 25 శాతం సుంకాలను పునరుద్ధరిస్తారా? అని ప్రశ్నించగా.. భారత్ ఆ దిశగా చర్యలు తీసుకున్న తర్వాతి రోజు నుంచే 25శాతం సుంకాలు అమలుచేస్తామని స్పష్టంచేశారు.
అంతకుముందు కూడా నవారో భారత్‌పై సంచలన కామెంట్స్ చేశారు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొంటూ భారత్ ‘లాభదాయకమైన పథకం’ నడుపుతోందని ఆరోపించారు. భారత్‌ను సుంకాల ‘మహారాజు’గా అభివర్ణించారు. భారత్‌తో అమెరికా వ్యాపారం వల్ల అమెరికన్లపై పడే నికర ప్రభావం ఏంటి?. అమెరికా వ్యాపారాన్ని, అమెరికన్ కార్మికులను ఇది దెబ్బతీస్తుంది. అమెరికా నుంచి పొందుతున్న డబ్బును రష్యన్ చమురు కొనుగోలుకు ఉపయోగిస్తున్నారు. ఆ డబ్బును రష్యా ఆయుధాల తయారీకి వాడి ఉక్రేనియన్లను చంపుతోంది. జరుగుతున్న రక్తపాతంలో తన పాత్రను గుర్తించడానికి భారత్ ఇష్టపడటం లేదు. ప్రస్తుతం భారత్ చేస్తున్నది శాంతిని కోరుకునేలా లేదని, యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు.