
వాషింగ్టన్: విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్దేశించిన హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్ల (దాదాపు రూ.88 లక్షలు)కు పెంచటాన్ని సవాల్ చేస్తూ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ కొలంబియాలోని ఒక జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్) చేసిన చట్టంలో ఏకపక్షంగా మార్పులు చేసే అధికారం దేశాధ్యక్షుడికి లేదని గురువారం దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది.
ట్రంప్ ప్రభుత్వంతోపాటు హోమ్‌లాండ్ సెక్యూరిటీ, మంత్రులు క్రిష్టీ ఎల్ నోయెమ్, మార్కో రుబియోలను ప్రతివాదులుగా చేర్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పూర్తిగా అన్యాయం, తప్పుదోవ పట్టించే విధానం అని ఆరోపించింది. ఫీజు పెంపు వల్ల నైపుణ్యగల విదేశీ నిపుణులు అమెరికాలోకి రాలేరని, అప్పుడు దేశంలో పరిశోధనలు, పోటీతత్వం దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేసింది.
ట్రంప్ నిర్ణయం అమెరికా ప్రత్యర్థి దేశాలకు మేలు చేసేదిగా ఉందని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ బ్రాడ్లీ విమర్శించారు. పార్లమెంటు అధికారాలను కాలరాసి, అధ్యక్షుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం చెల్లదని స్పష్టంచేశారు. 3,600 ఉన్న హెచ్1బీ వీసా ఫీజును అధ్యక్షుడు ట్రంప్ గత నెల 19న ఒకేసారి లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం భారతీయ వృత్తినిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఏటా దాదాపు 85,000 హెచ్1బీ వీసాలు జారీచేస్తుండగా, అందులో దాదాపు 70 శాతం భారతీయులే దక్కించుకుంటున్నారు.