
సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ ముట్టడి
బాష్పవాయువు, సౌండ్ గ్రనేడ్లు ప్రయోగించిన పోలీసులు
ఢాకా: బంగ్లాదేశ్‌లో జనం మళ్లీ ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం శుక్రవారం రాజధాని ఢాకాలోని జాతీయ పార్లమెంట్ భవనం ఎదుట భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం తీసుకొచి్చన ‘జూలై నేషనల్ చార్టర్’ను వారు వ్యతిరేకించారు. ఈ చార్టర్‌లో తమ సమస్యలను ప్రస్తావించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఏడాది జూలైలో షేక్ హసీనా ప్రభుత్వంపై జరిగిన పోరాటంలో చాలామంది మరణించారు.
వందలాది మంది గాయపడ్డారు. బాధితులను ఆదుకోవడంపై ‘జూలై నేషనల్ చార్టర్’ఎలాంటి ప్రస్తావన లేకపోవడం పట్ల జనాగ్రహం వ్యక్తమైంది. శుక్రవారమే ఈ చార్టర్‌పై పార్లమెంట్ భవనంలో సంతకాలు జరగాల్సి ఉంది. షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన నిరసనకారులు, వారి కుటుంబ సభ్యులు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించారు.
తమను అధికారికంగా గుర్తించి, చట్టపరంగా రక్షణ కల్పించాలనిచ ఆర్థిక సాయం అందించాలని, పునరావాస ప్యాకేజీ ప్రకటించాలని, ఈ అంశాన్ని చార్టర్‌లో చేర్చాలని నినదించారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఫరీ్నచర్‌కు నిప్పుపెట్టారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, సౌండ్ గ్రనేడ్లు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. ప్రజల ఆందోళన నేపత్యంలో కొన్ని రాజకీయ పార్టీలు చార్టర్‌పై సంతకాల కార్యక్రమానికి హాజరు కాలేదు. కీలకమైన నేషనల్ సిటిజెన్ పార్టీ సైతం దూరంగా ఉంది.
నూతన బంగ్లాదేశ్ జననం: యూనస్
జూలై నేషనల్ చార్టర్(జాయింట్ డిక్లరేషన్)పై సంతకంతో నూతన బంగ్లాదేశ్ జని్మంచిందని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పేర్కొన్నారు. చార్టర్‌పై వివిధ రాజకీయ పారీ్టల నేతలు సంతకాలు చేశారు. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాత్–ఇ–ఇస్లామ్ నేతలు సంతకాలు చేసినట్లు తెలిసింది. ‘జూలై యోధులకు’దేశం రుణపడి ఉందని మహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు.
ఏమిటీ చార్టర్?
మహమ్మద్ యూనస్ నియమించిన నేషనల్ కాన్సెన్సస్ కమిషన్ వివిధ రాజకీయ పారీ్టలతో చర్చించి ‘జూలై నేషనల్ చార్టర్’ను రూపొంచింది. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పారీ్టతో మాత్రం చర్చించలేదు. 2024 జూలైలో షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభమైన నేపథ్యంలో దీనికి జూలై నేషనల్ చార్టర్ అని పేరుపెట్టారు. రాజ్యాంగ సవరణలు, చట్టపరమైన మార్పులు, తీసుకురావాల్సిన కొత్త చట్టాలు వంటి వివరాలను ఇందులో పొందుపర్చారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా పోరాడి మరణించివారి కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం ఇచ్చేలా చార్టర్‌లో ఒక సవరణ చేసినట్లు నేషనల్ కాన్సెన్సస్ కమిషన్ వెల్లడించింది.