
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్(Muhammad Yunus) వైదొలుగుతారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. ఈ మేరకు యూనస్ మంత్రివర్గ సలహాదారు శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. ‘‘బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనసే కొనసాగుతారు. ఆయనేం రాజీనామా చేస్తానని చెప్పలేదు కదా. ఆ వార్తలు కేవలం అసత్య ప్రచారాలే’’ అని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని ఇంగ్లీష్ మీడియా హౌజ్‌లు తాజాగా కథనాలు ఇచ్చాయి. ఇదే విషయాన్ని నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) చీఫ్ నహిద్ ఇస్లామ్ సైతం ధృవీకరించడంతో ఆయన పదవి నుంచి దిగిపోవడం ఖాయమనే చర్చ నడిచింది.
మరోవైపు.. బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్‌కి యూనస్ ప్రభుత్వానికి పొసగడం లేదు. సైనిక వ్యవహరాల్లో యూనస్ నిర్ణయాలు తీసుకోవడంపై వకార్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. 2026 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ ప్రకటన చేయగా.. అందుకు విరుద్ధంగా ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని వకార్ పట్టుబడుతున్నారు.