
అయితేనే గఢాఫీ కుమారుడికి బెయిలన్న కోర్టు
అంత డబ్బు లేదన్న ఆయన లాయర్
పదేళ్లుగా విచారణ లేకుండా జైల్లోనే
బీరుట్: లిబియా దివంగత నేత కల్నల్ గఢాఫీ కుమారుడు హానిబాల్ గఢాఫీని బెయిల్‌పై విడుదల చేసేందుకు అక్కడి కోర్టు అంగీకరించింది. అయితే, బెయిల్ పూచీకత్తును రూ.96.83 కోట్లుగా నిర్ణయించింది. ఈ మొత్తం ఎప్పుడు చెల్లిస్తే అప్పుడు విడుదల కావచ్చని పేర్కొంది. దశాబ్దాలపాటు అధికారంలో కొనసాగిన గఢాఫీ తిరుగుబాటుదార్ల చేతిలో 2011 అక్టోబర్‌లో చనిపోయారు.
అయితే, ఆయన పాలనాకాలంలో 1978లో లిబియాకు వచ్చిన షియాల గురువు మౌసా అల్ సదర్ అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యారు. ఆయన ఏమయ్యారో ఎవరికీ తెలియదు. అయితే, గఢాఫీ కుమారుడు హానిబాల్‌కు ఆ విషయం తెలుసని అనుమానించిన మిలిటెంట్ల గ్రూపు 2015లో ఆయన్ను అపహరించి బాల్బెక్‌లో ఉంచింది. అనంతరం లెబనాన్ పోలీసులు అతడిని మిలిటెంట్ల చెరనుంచి విడిపించి బీరుట్ జైలులో ఉంచారు. అప్పటి నుంచి దాదాపు దశాబ్దకాలంగా ఎలాంటి విచారణ లేకుండా జైలులోనే మగ్గుతున్నారు.
శుక్రవారం అధికారులు ఆయన్ను జస్టిస్ ప్యాలెస్‌లో జడ్జి జహెర్ హమాదెహ్ ఎదుట హాజరుపరిచారు. హానిబాల్ బెయిల్ పూచీకత్తును రూ.96.83 కోట్లుగా ఆయన నిర్ణయించారు. ఈ మొత్తం ఎప్పుడు చెల్లిస్తే అప్పుడే జైలు నుంచి విడుదల కావచ్చని తెలిపారు. అయితే, రెండు నెలలపాటు దేశం విడిచి వెళ్లరాదనే షరతును విధించారు.
హానిబాల్ తరఫు లాయర్ చర్బెల్ మిలాడ్ అల్–ఖౌరీ ఈ విషయం మీడియాకు వెల్లడించారు. హానిబాల్ వద్ద ప్రస్తుతం డబ్బు లేదని చెప్పారు. ఆయన బ్యాంకు అక్కౌంట్లపై నిషేధం ఉందని చెప్పారు. కాగా, షియా గురువు మౌసా అల్ సదర్ అదృశ్యం వ్యవహారం లెబనాన్‌లో ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. లెబనాన్‌లోని ఏదో ఒక జైలులో ఆయన సజీవంగా ఉండి ఉంటారని కుటుంబీకులు భావిస్తుండగా, ఆయన ఎప్పుడో చనిపోయి ఉంటారని చాలా మంది అనుకుంటున్నారు. జీవించి ఉంటే ఆయనకు ఇప్పుడు 96 ఏళ్లుంటాయని అంచనా.