
ఆఫీస్ మెమోరాండం అమలు స్టే ఆదేశాలపై హైకోర్టులో వాడీవేడి వాదనలు
మద్యం అక్రమ కేసులో డిఫాల్ట్ బెయిల్ మంజూరు సరైనదే..
రిమాండ్ పొడిగింపు సెక్షన్‌పై హైకోర్టును తప్పుదారి పట్టించారు
సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు
పిటిషన్‌కు విచారణార్హత లేదన్న మరో సీనియర్ న్యాయవాది మనోహర్‌రెడ్డి
ఏసీబీ కోర్టు అభ్యంతరాలను సిట్ ఇప్పటికే సవరించిందన్న విషయం ప్రస్తావన
అలాంటప్పుడు మెమోరాండంను ఎలా సవాలు చేస్తుందని ప్రశ్న
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై గత వాదనల సందర్భంగా హైకోర్టును సిట్ తప్పుదారి పట్టించిందని సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి ధర్మాసనానికి నివేదించారు. డిఫాల్ట్ బెయిల్ మంజూరు సరైనదేనని స్పష్టం చేశారు. ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్‌ను సవాలు చేస్తూ సిట్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. తమ చార్జిïÙట్‌లలో లోపాలను ఎత్తిచూపుతూ ఏసీబీ కోర్టు జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంను కూడా సవాలు చేసింది. మరో నిందితుడు బూనేటి చాణక్యకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయకుండా ఏసీబీ కోర్టును నిరోధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ వ్యాజ్యాలపై గత వారం విచారణ జరిపిన న్యాయమూర్తి ఏసీబీ కోర్టు జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంపై స్టే విధించిన విషయం తెలిసిందే. ఆఫీస్ మెమోరాండం ఆధారంగా ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్‌లోని పలు అంశాలపై కూడా స్టే ఇచ్చారు. హైకోర్టులో గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా కృష్ణమోహన్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది తప్పెట నిరంజన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ, ఏసీబీ కోర్టు నిందితులకు సీఆర్‌పీసీ సెక్షన్ 309 కింద రిమాండ్ పొడిగిస్తూ వచ్చినట్లు సిట్ న్యాయవాది హైకోర్టుకు చెప్పారని, హైకోర్టు సైతం ఆ విషయాన్ని అలాగే రికార్డ్ చేసి, దాని ఆధారంగా మద్యం తర ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. వాస్తవానికి ఏసీబీ కోర్టు సీఆర్‌పీసీ సెక్షన్ 167 (2) కింద నిందితులకు రిమాండ్ పొడిగించిందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు.
క్వాష్ పిటిషన్ చెల్లదు
చాణక్య తరఫు సీనియర్ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, గోవిందప్ప తదితరుల డిఫాల్ట్ బెయిల్ రద్దు కోసం సిట్ దాఖలు చేసిన వ్యాజ్యాల నుంచి తమ వ్యాజ్యాన్ని వేరు చేయాలని కోరారు. ఏసీబీ కోర్టు ఆఫీస్ మెమోరాండం కొట్టేయాలని కోరుతూ సీఆర్‌పీసీ సెక్షన్ 482 కింద క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని, ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదఅన్నారు. మెమోరాండం పూర్తి కార్యనిర్వాహక ఉత్తర్వు అని, దీనిని సెక్షన్ 482 కింద సవాలు చేయడానికి వీల్లేదని చెప్పారు. ఆ ఆఫీస్ మెమోరాండంను సిట్ ఎలా సవాలు చేస్తుందని ప్రశి్నంచారు. ఆఫీస్ మెమోరాండంపై హైకోర్టు స్టే విధించడం వల్ల పిటిషనర్ బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టులో పెండింగ్‌లో ఉండిపోయిందన్నారు.
తదుపరి విచారణ 17కు వాయిదా
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఈ వ్యవహారంలో న్యాయ సంబంధిత అంశాలు ముడిపడి ఉన్నాయని, లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇరుపక్షాలు తమ తమ వాదనలతోపాటు, ఆ వాదనలను సమర్థించుకునేందుకు అనుకూలంగా ఉన్న తీర్పుల కాపీలను తమ ముందుంచాలని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేశారు.