
కాబూల్: దాయది దేశం పాకిస్తాన్(pakistan), ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు జరిగిన తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. డ్యూరాండ్ లైన్ వెంట వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడుల కారణంగా పదుల సంఖ్యలో ఆప్ఘన్ పౌరులు మృతి చెందినట్టు తెలిసింది. వారిలో ముగ్గురు ఆప్ఘన్ క్రికెటర్లు కూడా ఉన్నారు.
పాక్ సైన్యం ఆప్ఘనిస్థాన్‌లోని మూడు రాష్ట్రాల్లో జనావాసాలే లక్ష్యంగా వైమానిక దాడులకు పాల్పడింది. ఇరుదేశాలు 48 గంటల కాల్పుల విరమణను పొడిగించడానికి పరస్పరం అంగీకరించిన కొన్ని గంటల తర్వాత పాక్ సైన్యం ఓవరాక్షన్‌కు దిగింది. డ్యూరాండ్ లైన్ (Durand Line) వెంబడి ఉన్న పక్తికా (Paktika) ప్రావిన్స్‌లోని అర్గున్, బెర్మల్ జిల్లాలలో పలు ఇళ్లపై మూడు ప్రాంతాల్లో బాంబు దాడి చేసింది. పాక్ దాడుల కారణంగా ముగ్గరు ఆప్ఘన్ క్రికెటర్లతో పాటుగా మరో 10 మంది పౌరులు మృతిచెందినట్టు సమాచారం.
మరోవైపు.. పాక్ చర్యలపై తాలిబాన్ సీనియర్ నేత ఒకరు స్పందిస్తూ.. మూడు జిల్లాలపై పాక్ సైన్యం గగనతల దాడులకు తెగబడింది. పాక్ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించుకునేందుకు, రెండు దేశాల నాయకులు శనివారం ఖతార్, దోహాలో సమావేశం కానున్నారు. ఇప్పటికే పాక్ ప్రతినిధులు దోహా చేరుకున్నారు, ఆప్ఘనిస్థాన్ నుంచి ఇంకా బయల్దేరాల్సి ఉంది. అయితే, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందే ఉల్లంఘించడం గమనార్హం.