
ఇస్లామాబాద్: పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ దళాలు, స్థానిక ఉగ్రవాదులు సరిహద్దు వెంబడి జరిపిన కాల్పులకు తమ సైన్యం ప్రతీకారం తీర్చుకున్నదని పాకిస్తాన్ తెలిపింది. తాజా ఘర్షణల్లో పదుల సంఖ్యలో సైనికులతో పాటు పౌరులు కూడా మృతిచెందారని ఇరువైపుల భద్రతా అధికారులు మీడియాకు తెలిపారు.
కాందహార్ ప్రావిన్స్‌లోని స్పిన్ బోల్డాక్‌లో ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఆఫ్ఘన్ తాలిబాన్ వర్గాలు గస్తీ తిరుగుతున్నాయి. కాగా ప్రధాన సరిహద్దు పోస్టులపై ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు చేసిన రెండు దాడులను తిప్పికొట్టామని, దక్షిణ కాందహార్ ప్రావిన్స్‌లోని ఆఫ్ఘన్ వైపున ఉన్న స్పిన్ బోల్డాక్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో దాదాపు 20 మంది తాలిబాన్ సభ్యులు మరణించారని పాకిస్తాన్ సైన్యం తెలిపింది. పౌర జనాభాను పట్టించుకోకుండా ఈ దాడి జరిగిందని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ సైన్యంతో సరిహద్దులో రాత్రిపూట జరిగిన ఘర్షణల్లో దాదాపు 30 మంది మరణించారని తెలుస్తోంది.
రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో జరిగిన తాజా హింసలో 15 మంది పౌరులు మృతి చెందారని సంబంధిత అధికారులు ఆఫ్ఘన్ వార్తా సంస్థకు తెలిపారు. పాకిస్తాన్ సరిహద్దు జిల్లా ఒరాక్జాయ్‌లో దళాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన పోరాటంలో ఆరుగురు పాకిస్తాన్ పారామిలిటరీ సైనికులు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని భద్రతా అధికారులు వెల్లడించినట్లు రాయిటర్స్ పేర్కొంది. కాగా తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పాకిస్తాన్ దళాలు భారీ ఆయుధాలతో దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గత వారాంతంలో ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్తాన్‌పై ప్రతీకార దాడులు చేపట్టింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి.
కాగా తమ దాడుల్లో 58 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించినప్పటికీ, మృతుల సంఖ్య 23 అని పాకిస్తాన్ తెలిపింది. ఎదురు కాల్పుల్లో 200 మందికి పైగా తాలిబాన్లను, అనుబంధ దళాలను అంతమొందించామని పేర్కొంది. ఈ ఉద్రిక్తతల మధ్య అక్టోబర్ 12 నుంచి ఆఫ్ఘనిస్తాన్- పాకిస్తాన్ మధ్య సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేశారు. ఏఎప్‌పీ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం తాజాగా జరిపిన మోర్టార్ కాల్పుల్లో 15 మంది పౌరులు మరణించారని స్పిన్ బోల్డక్ ప్రాంతంలోని స్థానిక సమాచార విభాగం ప్రతినిధి అలీ మొహమ్మద్ హక్మల్ తెలిపారు. 80 మందికి పైగా మహిళలు, పిల్లలు గాయపడ్డారని స్పిన్ బోల్డక్ జిల్లా ఆసుపత్రి అధికారి అబ్దుల్ జాన్ బరాక్ మీడియాకు తెలిపారు.