
పాక్ నుంచి చొరబాట్లను సహించబోం
అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌తో సరిహద్దుల వెంట కొనసాగుతున్న ఉద్రిక్తత సమసిపోయేందుకు శాంతియుత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నట్లు అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమిర్‌ఖాన్ ముత్తాఫీ వ్యాఖ్యానించారు. పోరు సద్దుమణిగేందుకు శాంతియుత మార్గాలను అన్వేషిస్తామని, అది సాధ్యంకాకుంటే ఇతర ‘మార్గాలను’ వెతుకుతామని ఆయన అన్నారు. భారత పర్యటనలో ఉన్న ముత్తాఖీ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
‘‘ ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల వంటి విదేశీ శక్తుల చొరబాట్లను అడ్డుకునేందుకు అఫ్గానిస్తాన్ ఐక్యంగా పోరాడుతుంది. అఫ్గాన్ సార్వభౌమత్వానికి భంగపరిచే ఎలాంటి చర్యలను మేం సహించబోం. చర్చలు, పరస్పర అవగాహన ద్వారా సమస్యల పరిష్కారానికే మా ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకూడదనేదే మా విదేశాంగ విధానం.
అది కుదరనప్పుడు మేం వేరే దారులను వెదికి అనుకున్నది సాధిస్తాం. అయినా మాకు పాక్ ప్రభుత్వం, ప్రజలతో ఎలాంటి విబేధాలు లేవు. అక్కడ తిష్టవేసిన కొన్ని శక్తులే(ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు) అసలు సమస్య. అఫ్గాన్‌లో అంతర్గతంగా విబేధాలు ఉండి ఉండొచ్చు. కానీ బయటిశక్తుల నుంచి పెను ప్రమాదం పొంచి ఉంటే తాలిబాన్ ప్రభుత్వ, పౌరులు, మతాధికారులు అంతా ఏకమై శత్రువును తుదముట్టిస్తారు ’’ అని ఆయన అన్నారు.