మడగాస్కర్ సైనిక నేత మైఖేల్ వెల్లడి
ఆంటనానారివో: తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన మడగాస్కర్‌లో అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని కూలదోసిన మిలటరీ కమాండర్, కల్నల్ మైఖేల్ ర్యాండ్రియానిరినా బుధవారం తన మనసులోని మాట బయటపెట్టారు. త్వరలో దేశాధ్యక్షునిగా పగ్గాలు చేపట్టబోతున్నట్లు అంతర్జాతీయ మీడియాకు చెప్పారు. జెన్ జెడ్ యువత నేతృత్వంలో మొదలైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉప్పెనలా మారడంతో ప్రాణభయంతో అధ్యక్షుడు రాజోలీనా విదేశానికి పారిపోయారు.
రాజోలీనా లేకపోవడంతో దేశ అత్యున్నత రాజ్యాంగ కోర్టు ఆహ్వానం మేరకు త్వరలో తాను దేశ పరిపాలనా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు మైఖేల్ చెప్పారు. మైఖేల్ సారథ్యంలోని నిపుణులైన క్యాప్‌శాట్ సైనిక బృందం తిరుగుబాటు చేపట్టడంతో రాజోలీనా చేతులెత్తేయడం తెల్సిందే. ‘‘నిన్ననే మేం వాస్తవానికి బాధ్యతలు తీసుకోవాల్సింది. దేశంలో అధ్యక్షుడు లేడు.
సెనేట్‌లోనూ అధ్యక్షుడి జాడ లేదు. అసలు ప్రభుత్వమే లేదు. అందుకే త్వరలో మేం నూతన ప్రధానికి నియమిస్తాం’’అని మైఖేల్ వ్యాఖ్యానించారు. అయితే ఎప్పటికల్లా నూతన ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందనే మైఖేల్ స్పష్టంచేయలేదు. సెనేట్, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం అధికారులను తొలగిస్తున్నట్లు మైఖేల్ ఇప్పటికే జాతీయరేడియోలో ప్రకటించడం తెల్సిందే.
1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందాక మడగాస్కర్ ఎన్నో తిరుగుబాట్ల పాలిటపడింది. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెచ్చరిల్లడం, ప్రజల జీవన వ్యయాలు పెరగడం, నీటికొరత, విద్యుత్ సంక్షోభం, అమాంతం పెరిగిన అవినీతితో జెన్‌జెడ్ యువత విసిగిపోయి ఉద్యమబాట పట్టడం, దీనికి సైనిక తిరుగుబాటు తోడవడంతో రాజోలీనా ప్రభుత్వం కూలిపోయింది.


