ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయొద్దు
సైనిక కమాండర్లకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సూచన
జైసల్మేర్: ఎలాంటి ఉగ్రవాద చర్యనైనా మనం సొంతంగానే తిప్పికొట్టగలమని ఆపరేషన్ సిందూర్ ద్వారా నిరూపించామని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన ప్రత్యర్థులను ఏనాడూ తక్కువ అంచనా వేయొద్దని సైన్యానికి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు ఎదురైనా గట్టిగా ప్రతిఘటించడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేశారు.
శుక్రవారం రాజస్తాన్‌లోని జైసల్మేర్‌లో సైనిక కమాండర్లతో రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. భారత్–చైనా, భారత్–పాకిస్తాన్ సరిహద్దుల్లో భద్రతపై సమీక్ష నిర్వహించారు. అలాగే భారత సైనిక దళాల సన్నద్ధతను సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ పలు సూచనలు చేశారు. నేటి ఆధునిక యుగంలో సమాచార యుద్ధరీతిపై దృష్టి పెట్టాలని చెప్పారు. అత్యాధునిక రక్షణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్నారు. ఇందుకోసం సైనిక దళాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
భారత సైనిక శక్తికి ఆపరేషన్ సిందూర్ ఒక ప్రతీక అని అభివరి్ణంచారు. మన సైనికుల బలం కేవలం ఆయుధాల్లోనే కాకుండా.. నైతిక క్రమశిక్షణ, వ్యూహాత్మకలో ఉందని పేర్కొన్నారు. ఇది మిలటరీ ఆపరేషన్‌గానే కాకుండా మనదేశ ధైర్యసాహసాలకు, సంయమనానికి గుర్తుగా చరిత్రలో నిలిచిపోతుందని ఉద్ఘాటించారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని తేలి్చచెప్పారు. సమీక్షా సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
పాక్ సరిహద్దులో ‘థార్ శక్తి’ విన్యాసాలు
భారత్–పాకిస్తాన్ సరిహద్దులో జైసల్మేర్ జిల్లాలోని లాంగేవాలా బోర్డర్ పోస్టులో భారత సైన్యం ‘థార్ శక్తి’ శుక్రవారం ప్రత్యేక విన్యాసాలు నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. వందలాది మంది జవాన్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. డ్రోన్లు, రోబో జాగిలాలను, అత్యాధునిక ఆయుధాలను సైతం ప్రదర్శించారు. ఎడారి యుద్ధరీతిలో భారత సైన్యం ధైర్యసాహసాలు, సన్నద్ధతను రాజనాథ్ సింగ్ ప్రశంసించారు.


