ఉగ్రవాదులను కాపాడేందుకు ప్రయత్నాలు
సంస్కరణలను చేపట్టకుంటే ఐరాస వృథా
విదేశాంగ మంత్రి జై శంకర్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడికి కారకులైన వారిని రక్షించేందుకు ఐరాస భద్రతా మండలిలో జరిగిన ప్రయత్నాలను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మరోసారి ఎండగట్టారు. వ్యూహం పేరుతో ఉగ్రదాడి బాధ్యులను, కారకులను ఒకే గాటన కట్టడం సరికాదని పేర్కొన్నారు. ఐరాస చర్యలు ఒక్కోసారి ఏకపక్షంగా మారుతున్నాయన్నారు.
స్వయం ప్రకటిత ఉగ్రవాదులను ఆంక్షల ప్రక్రియ నుంచి కాపాడేందుకు ప్రయతి్నస్తుంటే నిజాయతీకి స్థానమెక్కడున్నట్లు?అంటూ జై శంకర్ ప్రశ్నించారు. తక్షణమే తగు రీతిలో సంస్కరణలను చేపట్టకుంటే ఐరాసతో ఎలాంటి ఫలితమూ ఉండదని స్పష్టం చేశారు. ఐరాస 80వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.
ఎలాంటి అర్ధవంతమైన సంస్కరణను చేపట్టాలన్నా సంస్కరణ ప్రక్రియతోనే దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. సంస్కరణలను అమలు చేయడమే ప్రపంచ దేశాలకు పెను సవాలుగా మారిందన్నారు. ఉగ్రవాదంపై స్పందించే విషయంలో ఐరాస ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని జై శంకర్ అన్నారు.
అమానవీయమైన పహల్గాం ఉగ్రదాడిని ఖండించే విషయంలో ఐరాస భద్రతా మండలిలో తీర్మానానికి సాక్షాత్తూ కౌన్సిల్ సభ్యుడే అభ్యంతరం తెలిపారంటూ పరోక్షంగా ఆయన పాక్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. లష్కరే తోయిబా ముసుగు సంస్థే ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్‌ఎఫ్). పహల్గాంలో దాడికి పాల్పడింది తామేనంటూ టీఆర్‌ఎఫ్ స్వయంగా ప్రకటించుకుంది. అయితే, మండలిలో సభ్యురాలిగా కొనసాగుతున్న పాకిస్తాన్ పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ వెలువరించిన తీర్మానంలో టీఆర్‌ఎఫ్ ప్రస్తావన లేకుండా చేయడం గమనార్హం.
గతంలో పలుమార్లు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలను శాశ్వతసభ్య దేశమైన చైనా అడ్డుకుంది. అందుకే, ఉగ్రవాదులను ఆంక్షల చట్రం నుంచి కాపాడేందుకు ప్రయతి్నస్తున్నారంటూ జై శంకర్ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలు కేవలం మాటలకే పరిమితమైన పక్షంలో అభివృద్ధి, సామాజిక–ఆర్థిక పురోగతి మరింత అథోగతికి చేరుకుంటాయన్నారు. ఏదేమైనా ఈ సంక్షోభ సమయంలో ఐక్యరాజ్యసమితికి భారత్ మద్దతుగా నిలుస్తుందని ఆయన తెలిపారు. అభివృద్ధి, పురోగతితోపాటు శాంతి, భద్రతలకు భారత్ ప్రాధాన్యమిస్తుందన్నారు. ఐరాస 80వ అవతరణ దినోత్సవం సందర్భంగా జై శంకర్ ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేశారు.


