ప్రతిపక్ష ఆర్జేడీకి ఘోర పరాజయం తప్పదు: అమిత్ షా
సివాన్: బిహార్ ప్రజలు నవంబర్ 14వ తేదీన అసలైన దీపావళి వేడుకలను జరుపుకోనున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష ఆర్జేడీతోపాటు మహాగఠ్ బంధన్ కూటమికి ఘోర పరాజయం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. సివాన్ జిల్లాలో శుక్రవారం బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
లాలూ ప్రసాద్ సారథ్యంలోని ఆర్జేడీ గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత మహ్మద్ షహబుద్దీన్ కుమారుడు ఒసామా షాహాబ్‌కు టికెట్ ఇవ్వడంపై అమిత్ షా.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో షహబుద్దీన్ కుమారుడిని ఘోరంగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లాలూ ప్రసాద్, రబ్డీదేవిల ఇరవయ్యేళ్ల జంగిల్ రాజ్‌ను సివాన్ వాసులు చవిచూశారని విమర్శించారు. లాలూ మళ్లీ జంగిల్ రాజ్ తేవాలనుకుంటున్నారని ఆరోపించారు. నవంబర్ 14వ తేదీన ప్రకటించే ఎన్నికల ఫలితాల్లో ఆర్జేడీ, ఆ పార్టీ మిత్రపక్షాలను అవమానకర రీతిలో ఓడించి, బిహార్ ప్రజలు అసలైన దీపావళిని జరుపుకోవడం ఖాయమని అమిత్ షా వ్యాఖ్యానించారు.


