
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దాయాది దేశం పాకిస్తాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమేనన్న ఆయన.. పాక్ భూభాగంలోని ప్రతీ అంగుళం ఇప్పుడు మన బ్రహ్మోస్ క్షిపణి పరిధిలో ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు.
శనివారం లక్నోలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌లో తయారైన మొదటి బ్యాచ్ మిస్సైళ్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిసి రాజ్‌నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇది భారత రక్షణ పరిశ్రమకు ఒక మైలురాయి. శత్రువులు ఇప్పుడు మన పరిధిలోనే ఉన్నారు.
.. బ్రహ్మోస్ నుంచి తప్పించుకోవడం శత్రువులకు ఇక అసాధ్యం. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే. దీని ద్వారా భారత సైన్యం తన శక్తిని నిరూపించింది. ఆ ట్రైలర్‌నే చూసి పాకిస్తాన్‌కి అర్థమై ఉంటుంది. భారత్ పాకిస్తాన్‌ను సృష్టించగలిగితే, ఇంకేమి చేయగలదో చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు విజయం మనకు అలవాటైపోయింది. బ్రహ్మోస్ కేవలం శక్తి ప్రదర్శన కాదని.. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే అడుగు’’ అని ఆయన అభివర్ణించారు.
బ్రహ్మోస్ మిస్సైల్స్‌ను భారత్ ఆపరేషన్ సిందూర్ టైంలో ప్రయోగించింది. Fire and Forget టెక్నాలజీతో పని చేయడం దీని ప్రత్యేకత. అంటే.. లక్ష్యాన్ని చేరిన తర్వాత మానవ ప్రమేయం లేకుండానే దాని పని అది చేసుకుపోతుంది.
భారత్ డీఆర్‌డీవో-రష్యా ఎన్‌పీఓఎం సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పేరిట సంయుక్తంగా వీటిని డెవలప్ చేస్తున్నాయి. త్రివిధ దళాలు దీనిని ఉపయోగించుకుంటున్నాయి. హైదరాద్, తిరువనంతపురం, నాగ్‌పూర్‌లలో వీటి విడిభాగాలు తయారు అవుతున్నాయి. తాజాగా లక్నోలోనూ ఓ యూనిట్‌ను ప్రారంభించారు. తాజా వివరాల ప్రకారం.. బ్రహ్మోస్‌కు 75% వరకు స్వదేశీ భాగాలు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అందుకే రాజ్‌నాథ్ దీనిని ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే కీలక అడుగు అని అన్నారు.