
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను విలాసవంతమైన ఫెరారీ కారుతో, తమ దేశాన్ని చెత్త ట్రక్కుతో పోలుస్తూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వ్యాఖ్యలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ దీటుగా బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలతో పాకిస్తాన్ తన వైఫల్యాన్ని ఒప్పుకున్నట్లేనని పేర్కొన్నారు. దీంతో, దాయాదికి ఎదురుదెబ్బ తగిలింది.
తాజాగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘రెండు దేశాలూ ఒకే సమయంలో స్వాతంత్య్రం పొందాయి. ఒక దేశం మంచి విధానాలు, ముందుచూపు, కష్టించేతత్వంతో ఫెరారీ కారు వంటి మంచి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పర్చుకోగా, మరో దేశం అప్పటి నుంచి ఇప్పటి దాకా చెత్తగానే మిగిలిపోయింది. అది వాళ్ల సొంత వైఫల్యం. ఇదే విషయాన్ని అసిమ్ మునీర్ స్వయంగా అంగీకరించారని నాకనిపిస్తోంది’ అంటూ వ్యాఖ్యానించారు. మునీర్ పోలిక పాకిస్తాన్ సమస్యాత్మక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని రాజ్‌నాథ్ అన్నారు. ‘పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, తెలిసో తెలియకో దోపిడీదారు మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. అవతరించినప్పటి నుంచీ ఆ దేశానిది ఇదే తీరు. పాక్ సైన్యం భ్రమలను మనం తొలగించాలి’ అని మంత్రి పేర్కొన్నారు.
ఇటీవల అమెరికా పర్యటనలో మునీర్ మాట్లాడుతూ.. ‘హైవేపై ఫెరారీ కారు మాదిరిగా మెరుస్తూ వస్తున్న భారత్‌ను, గులకరాళ్ల ట్రక్కు వెళ్లి ఢీకొట్టిందనుకోండి, నష్టం జరిగేది ఎవరికి?’ అంటూ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. భారత్ అభివృద్ధి దిశగా సాగుతుండగా, పాకిస్తాన్ వెనుకబడి ఉందని, సెల్ఫ్ గోల్ చేసుకున్నారంటూ మునీర్‌పై విమర్శలు వచ్చాయి.
ఆర్మీలో మహిళలకు అనుకూల విధానాలు
సాయుధ బలగాలతోపాటు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేలా తమ ప్రభుత్వం అనే విధానాలను అమలు చేస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. సేవలందించడమే కాదు, నాయకత్వం వహించేందుకు అవకాశమిస్తున్నామన్నారు. శుక్రవారం ఢిల్లీలో మొదలైన 15 దేశాల మహిళా అధికారుల ఐరాస ఉమెన్ మిలటరీ ఆఫీసర్స్ కోర్స్‌లో ఆయన మాట్లాడారు. ఐరాస మిషన్లలో వృత్తిపరమైన సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం రెండు వారాలపాటు కొనసాగనుంది.