‘నన్ను చూస్తూ వెలికిగా నవ్వాడు, అందుకే కోపంతో..’ సారీ చెప్పిన దీపిక | Who is Deepika Jha Viral with Delhi University Professor Row | Sakshi
Sakshi News home page

‘నన్ను చూస్తూ వెలికిగా నవ్వాడు, అందుకే కోపంతో..’ సారీ చెప్పిన దీపిక

Oct 18 2025 12:25 PM | Updated on Oct 18 2025 1:16 PM

Who is Deepika Jha Viral with Delhi University Professor Row

ఏకంగా ప్రొఫెసర్‌పై.. అదీ పోలీసుల సమక్షంలో చెయ్యి చేసుకుంది ఓ విద్యార్థి సంఘం నాయకురాలు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో తీవ్ర దుమారం రేగింది. ఆమె క్షమాపణలు చెప్పేదాకా ఊరుకునేది లేదని లెక్చరర్ల సంఘం ఆందోళనకు దిగింది. ఈ తరుణంలో ఆమె వివరణ ఇచ్చుకుంది. 

ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ యూనియన్‌ జాయింట్‌ సెక్రటరీ, ఏబీవీపీ సభ్యురాలు దీపిక ఝా(Deepika Jha) ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. గురువారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కాలేజీలో ప్రొఫెసర్‌ సుజీత్‌ కుమార్‌పై ఆమె చెయ్యి చేసుకున్నారు. క్రమశిక్షణా కమిటీ భేటీలో.. అందునా అక్కడ ఉన్న పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. 

శుక్రవారం క్షమాపణలు చెబుతూ దీపికా ఝా ఓ వీడియో రిలీజ్‌ చేశారు. ఆయన (సుజీత్‌ కుమార్‌) నన్ను తదేకంగా చూశారు. నోటికొచ్చినట్లు తిట్టారు. బెదిరించారు. వెటకారంగా నవ్వారు. తట్టుకోలేకపోయా. అందుకే అలా చేయాల్సి వచ్చింది అని తన చర్యను సమర్థించుకున్నారామె. 

బహిరంగంగా సిగరెట్‌ కాల్చడంతో విద్యార్థులు పాడైపోతారని ఆయన్ని మేం ఆపే ప్రయత్నం చేశాం. దీంతో ఆయన క్రమశిక్షణా కమిటీ మీటింగ్‌ పెట్టారు. ఆ మీటింగ్‌లో నాతో అనుచితంగా వ్యవహరించాడు. కోపంతో అలా చేయాల్సి వచ్చింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్నది తన ఉద్దేశం కాదని చెబుతూనే జరిగిందానికి టీచర్స్‌ కమ్యూనిటీకి క్షమాపణలు తెలియజేశారామె. అయితే.. 

ఈ ఘటనపై కామర్స్‌ ప్రొఫెసర్‌ సుజీత్‌ కుమార్‌ వెర్షన్‌ మరోలా ఉంది. కాలేజీ స్టూడెంట్‌ కౌన్సిల్‌లో మూడు పోస్టులకు జరిగిన ఎన్నికల వ్యవహారమే దీనంతటికి కారణమని అంటున్నారాయన. ఈ ఎన్నికకు సంబంధించిన ఎన్‌ఎస్‌యూఐ(కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం) సభ్యులపై ఏబీవీపీ సభ్యులు దాడి చేశారని.. దీంతో వాళ్లను సస్పెండ్‌ చేశామని.. ఆ వ్యవహారంపై చర్చించే సమయంలో కమిటీ ముందు కూడా మరోసారి దాడి జరిగిందని అన్నారాయన. 

ఈ వ్యవహారంలో తనను రాజీనామా చేయాలంటూ ఎబీవీపీ సభ్యులు ఒత్తిడి చేశారని, ఆ టైంలో దీపిక వచ్చి తనపై దాడి చేసిందని ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారాయన. 

ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్‌ అసోషియేషన్‌(DUTA) భగ్గుమంది. దీపికా ఝాతో ఆ ప్రొఫెసర్‌కు క్షమాపణలు చెప్పించాల్సిందేనని పట్టుబడుతోంది. మరోవైపు.. స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(SFI) సైతం ఘటనను తీవ్రంగా ఖండించింది. తీవ్ర దుమారం రేపడంతో ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్‌ నీతా సెహగల్‌ నేతృత్వంలోని కమిటీ రెండు వారాల్లో నివేదికను వీసీ యోగేష్‌ సింగ్‌కు సమర్పించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement