
అతి త్వరలోనే నక్సలిజం నుంచి దేశానికి విముక్తి
గత 75 గంటల్లో 303 మంది నక్సలైట్లు లొంగిపోయారు
న్యూఢిల్లీ: మావోయిస్టుల బెడదను పూర్తిగా అంతం చేసే రోజు ఇక ఎంతోదూరంలో లేదని తాను గ్యారంటీ ఇస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అర్బన్ నక్సలైట్లను ప్రోత్సహించాయని ఆరోపించారు. నక్సలైట్లు విచ్చలవిడిగా హింసకు పాల్పడుతున్నా పట్టించుకోకుండా కళ్లు మూసుకున్నాయని ఆరోపించారు.
గత 75 గంటల్లో 303 మంది నక్సలైట్లు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారని తెలిపారు. వీరు సాధారణ నక్సలైట్లు కాదని, వారిపై లక్షలాది రూపాయల రివార్డు ఉందని చెప్పారు. నేడు దేశంలో కేవలం మూడు జిల్లాల్లోనే వామపక్ష తీవ్రవాద ప్రభావం బలంగా ఉందన్నారు. 11 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా 125 జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉండేదని వెల్లడించారు. ఆ సంఖ్య ఇప్పుడు 11కు పడిపోయిందన్నారు. వీటిలో మూడు జిల్లాల్లోనే వారి ఉనికి అధికంగా ఉందన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు.
గత దశాబ్ద కాలంలో వేలాది మంది మావోయిస్టులు హింసా మార్గాన్ని వీడి లొంగిపోయారని పేర్కొన్నారు. గత 50–55 ఏళ్ల కాలంలో నక్సలైట్లు వేలాది మందిని హత్య చేశారని, పాఠశాలలు, ఆసుపత్రులను కూల్చివేశారని వివరించారు. మావోయిస్టు తీవ్రవాదం అనేది యువతకు జరిగిన అన్యాయమేనని అభివర్ణించారు. మొదటిసారిగా తన మనసులోని బాధను బయటకు వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. నక్సలిజం, మావోయిస్టుల హింస నుంచి దేశం విముక్తి పొందే రోజు అతి దగ్గర్లలోనే ఉందని, ఇదీ నా గ్యారంటీ అని తేల్చిచెప్పారు. నక్సలిజం వల్ల నష్టపోయిన ప్రాంతాలు దాదాపు 60 ఏళ్ల తర్వాత మొదటిసారిగా దీపావళి పండుగ నిర్వహించుకోబోతున్నాయని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు.
అభివృద్ధి, సంక్షేమం కోసం సంస్కరణలు
దేశ ప్రగతే లక్ష్యంగా సంస్కరణల విషయంలో తమ ప్రభుత్వం దృఢచిత్తంతో ముందుకెళ్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. గత ప్రభుత్వాలు కేవలం కొన్ని అవసరాల రీత్యా సంస్కరణలు తీసుకొచ్చాయని అన్నారు. తమ ప్రభుత్వం మాత్రం పూర్తి అంకితభావం, బలమైన విశ్వాసంతో దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సంస్కరణలు అమలు చేస్తోందని ఉద్ఘాటించారు. ప్రతి సంస్కరణను ఒక విప్లవంగా మారుస్తున్నామని స్పష్టంచేశారు. ఉగ్రవాద దాడులు జరిగితే ఇప్పుడు భారత్ నిశ్శబ్దంగా ఉండడం లేదని, ముష్కర మూకలపై భీకరస్థాయిలో ప్రతిదాడులు చేస్తోందని తెలిపారు. సర్జికల్ దాడులు, వైమానిక దాడులతో విరుచుకుపడుతోందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. యుద్ధాలు జరిగినప్పుడు ఆర్థిక ప్రగతి క్షీణిస్తుందని నిపుణులు చెబుతుంటారని, కానీ, అది అబద్ధమని తాము నిరూపించామన్నారు.
అవరోధాలు, స్పీడ్‌బ్రేకర్లు ఏమీ చేయలేవు
ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు కొనసాగుతున్నాయని, యుద్ధాలు, సంక్షోభాలు కనిపిస్తున్నాయని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారతదేశ అభివృద్ధి పరుగులు ఆగడం లేదన్నారు. ప్రపంచ దేశాలు భారత్ గురించి చర్చించుకుంటున్నాయని చెప్పారు. అవరోధాలు, స్పీడ్‌బ్రేకర్లు తమను ఏమీ చేయలేవన్నారు. ఈ ప్రగతి పరుగును ఆపే మూడ్‌లో దేశం లేదన్నారు.