
రూ.కోటికి పైగా నష్టపోయిన వృద్ధ దంపతులు
ఆందోళన వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం
కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం పేరుతో ఉత్తుత్తి ఉత్తర్వులు చూపించి వృద్ధ దంపతుల నుంచి రూ.కోటికి పైగా డబ్బు కాజేసిన ఘటనపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా న్యాయస్థానాల పేర్లతో జరిగే డిజిటల్ నేరాలతో ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోతామని పేర్కొంది. వ్యవస్థ గౌరవం దెబ్బతింటుందని తెలిపింది. ఇవి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
డిజిటల్ స్కాంలపై తక్షణ ప్రతిస్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు శుక్రవారం జస్టిస్ సూర్యకాంత్, జాయ్‌మాల్య భాగ్చీల ధర్మాసనం నోటీసులు పంపింది. తమను డిజిటల్ అరెస్టు చేయాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన ఆదేశాల ఫోర్జరీ పత్రాలను బాధిత పిటిషనర్లు చూపించారు.
కేటుగాళ్లు సెప్టెంబర్ 3 నుంచి 16వ తేదీ మధ్యలో సీబీఐ, ఈడీ అధికారులుగా, జడ్జీలుగా నటిస్తూ ఆడియో, వీడియో కాల్స్ ద్వారా కోర్టు నకిలీ ఉత్తర్వులను చూపించి, అరెస్టు, నిఘా అంటూ బెదిరించారని బాధితులు కొన్ని పత్రాలను చూపారు. వీటితో పలు దఫాలుగా రూ.1.05 కోట్లు కాజేశారన్నారు. హరియాణాలోని అంబాలాకు చెందిన వృద్ధ దంపతులు ఇటీవల ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌కి ఈ మోసంపై సెప్టెంబర్ 21న లేఖ రాశారు. వృద్ధ దంపతులకు జరిగిన అన్యాయంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. బాధితుల ఫిర్యాదుపై సుమోటోగా విచారణ చేపట్టింది.
విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నమిది..
న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థల పేరిట సృష్టించిన ఫోర్జరీ పత్రాలతో న్యాయస్థానంపై ప్రజలకు గల విశ్వాసం దెబ్బతింటుందని ధర్మాసనం ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. జడ్జీల సంతకాలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారి సంతకాలు, కోర్టు స్టాంప్ కూడా వేయడం తీవ్రమైన అంశమని పేర్కొంది. ‘జడ్జీ్జల సంతకాలతో సృష్టించిన ఫోర్జరీ పత్రాలు న్యాయస్థానంపై ప్రజల విశ్వాసంతోపాటు, వ్యవస్థ మూలాలు దెబ్బ తింటాయి. ఇటువంటి క్రిమినల్ చర్యలను సాధారణ మోసం, సైబర్ క్రైమ్‌గా పరిగణించకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. భవిష్యత్‌లో న్యాయస్థానాల పేర్లతో ప్రజలను మోసం చేసే ఘటనలను ఉపేక్షించరాదని పేర్కొంది. త్వరగా ప్రతిస్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది.
ఈవ్యవహారంలో తాము భారత అటార్నీ జనరల్ సహాయం కోరుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ఇది ఈ వృద్ధ దంపతుల సమస్య మాత్రమే కాదని, యావత్ దేశ ప్రజానీకం సమస్య అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. కేవలం పోలీసులను దర్యాప్తు వేగవంతం చేయమని చెప్పి వదిలేయడానికి వీలు లేదని పేర్కొంది. కేవలం ఇదొక్క కేసు మాత్రమే కాదు. ఇటువంటి నేరాలు దేశంలోని వివిధ ప్రాంతాలలో చాలా జరిగినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇటువంటి విస్తృత ప్రభావం కలిగిన నేరపూరిత చర్యలను పూర్తిగా దర్యాప్తు జరిపి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులు సమన్వయంగా కృషి చేయాల్సిన అవసరముందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో సాయం అందించాలని అటార్నీ జనరల్‌ను కోరిన ధర్మాసనం, వృద్ధ దంపతుల కేసు దర్యాప్తు పురోగతిని తెలియజేయాలంటూ హరియాణా ప్రభుత్వం, అంబాలా సైబర్ క్రైమ్ విభాగాలను ఆదేశించింది.