
సాక్షి,హైదరాబాద్: అడ్వకేట్స్ నాగమణి, వామన్ రావు జంట హత్యల కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇవాళ వామన్ రావు అనుచరులు బొల్లంపల్లి సంతోష్, ఇనుముల సతీష్‌ను సీబీఐ అధికారులు విచారించారు. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం 3 గంటల వరకు ప్రశ్నల వర్షం కురిపించిన అధికారులు.. వామన్ రావుతో సాన్నిహిత్యం, ఆయనతో కలిసి చేసిన ప్రయాణంలో పలు రకాల అంశాలపై ఆరా తీశారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ రెండో ఫ్లోర్‌లో విచారణ చేపట్టిన అధికారులు.. విచారణ కోసం ముందస్తు నోటీసులు అందించారు. గత 20 రోజుల నుంచి కొనసాగుతున్న సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఇక తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో సీబీఐ అధికారులు మొత్తం 130మందిని విచారిస్తున్నట్లు సమాచారం.
గతంలో తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసును తిరిగి దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. వామనరావు తండ్రి గట్టు కిషన్‌రావుకు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
తన కుమారుడు, కోడలి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్‌రావు 2021 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్లా ధర్మాసనం సీబీఐ విచారణకు ఆదేశించింది. కిషన్‌రావు తరఫున సీనియర్ న్యాయవాదులు మేనక గురుస్వామి, చంద్రకాంత్‌లు వాదనలు వినిపించారు.
నడిరోడ్డుపై హత్య: పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు, నాగమణి దంపతులను 2021 ఫిబ్రవరి 17న దుండగులు అడ్డగించి నడిరోడ్డుపైనే కత్తులతో నరికి చంపారు. మొదట ఈ కేసును స్థానిక పోలీసులు దర్యాప్తు చేశారు. దానిని సీబీఐకి అప్పగించాలని కిషన్‌రావు అదే ఏడాది సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో భాగంగా హత్యకు సంబంధించిన వీడియోలు, పత్రాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో కోర్టు ఆదేశించింది.
చనిపోయే ముందు వామనరావు ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియోపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్‌ఎస్‌ఎల్‌కి పంపించగా, అది అసలుదేనని ల్యాబ్ నివేదిక తేల్చింది. ఈ నివేదికతోపాటు అన్ని రికార్డులు పరిశీలించిన సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ తీర్పు చెప్పింది. సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియచేసింది. ఈ క్రమంలో వామన్‌రావు దంపతుల కేసు దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దీంతో సీబీఐ అధికారులు వామన్ రావు కేసును విచారిస్తున్నారు.